Mahaa Daily Exclusive

  అంతర్జాతీయ పరిణామాలతో స్టాక్ మార్కెట్‌కు భారీ దెబ్బ….

Share

ముంబయి, మహా.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, విదేశీ మదుపర్ల భారీ అమ్మకాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 84.60 డాలర్లకు చేరుకోగా, అమెరికా–ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగే సూచనలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రూపాయి మారకం విలువ కూడా డాలర్‌తో పోలిస్తే బలహీనపడడం, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలయ్యాయి.
ఉదయం ప్రారంభం నుంచే నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్, రోజంతా ఒత్తిడిలోనే కొనసాగింది. చివరకు 561 పాయింట్లు కోల్పోయి 77,054 వద్ద ముగియగా, నిఫ్టీ 158 పాయింట్లు తగ్గి 24,052 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 669 పాయింట్లు, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 274 పాయింట్లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు ఒక్కరోజే రూ.3,062 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.
రంగాల వారీగా చూస్తే బయోకాన్, కంటైనర్ కార్పొరేషన్, అదానీ పవర్, ఎంసీఎక్స్ ఇండియా, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు లాభపడగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, లోధా డెవలపర్స్, టాటా ఎల్క్సీ, ఎన్‌బీసీసీ, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో సమీప కాలంలో మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.