Mahaa Daily Exclusive

  ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి వెంటనే అనుమతులు ఇవ్వాలి…కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి…..

Share

ఢిల్లీ, మహా.
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఢిల్లీలో మంగళవారం ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే, మన్ననూరు–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ తదితర ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు.

రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి అవసరమైన భూసేకరణలో 95 శాతం ఇప్పటికే పూర్తయిందని ముఖ్యమంత్రి వివరించారు. ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగానికి కూడా కేంద్ర మంత్రిమండలి అనుమతి మంజూరు చేసి రెండు వైపులా ఒకేసారి పనులు ప్రారంభిస్తే నిర్మాణం వేగంగా పూర్తవడంతో పాటు వ్యయం కూడా తగ్గుతుందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారికి తక్షణమే ఆమోదం ఇవ్వాలని కోరారు.

భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల జాతీయ రహదారిని మంజూరు చేస్తే హైదరాబాద్–విజయవాడ మధ్య దూరం సుమారు 100 కిలోమీటర్లు తగ్గుతుందని, సరుకు రవాణా మరింత వేగవంతమవుతుందని సీఎం వివరించారు. మన్ననూరు–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు అవసరమైన అటవీ అనుమతులు ఇప్పించాలని, అలాగే మంచిర్యాల–హైదరాబాద్ మధ్య ఆరు వరుసల ప్రత్యామ్నాయ రహదారికి కేంద్రం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ రహదారికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని తెలిపారు.

సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ఈ రహదారి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ముఖ్యమంత్రి కోరారు.