కీవ్, మహా.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఈసారి ఉక్రెయిన్‌కు అత్యంత కీలకమైన నల్లసముద్ర రేవులు, ధాన్య ఎగుమతి మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణులు, డ్రోన్లతో వరుస దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల మధ్య కూడా ప్రపంచ ఆహార భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ధాన్యాల ఎగుమతులను కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఉక్రెయిన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు తమ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని ఉక్రెయిన్ డిప్యూటీ ఆర్థిక మంత్రి తారస్ వైసోత్స్కీ తెలిపారు. పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ గత ఏడాది స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ధాన్యాల ఎగుమతులను కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతర్జాతీయ ఆహార భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
జూలై నుంచి ప్రారంభమైన 2026–27 మార్కెటింగ్ సీజన్‌లో సుమారు 43 మిలియన్ మెట్రిక్ టన్నుల ధాన్యాలను ఎగుమతి చేయాలని ఉక్రెయిన్ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది 37 మిలియన్ టన్నులకు పైగా ధాన్యాలను విదేశాలకు ఎగుమతి చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే తాజా దాడుల కారణంగా ఆ లక్ష్యాలపై అనిశ్చితి నెలకొంది.
ఉక్రెయిన్ రైతు సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, రష్యా క్షిపణి, డ్రోన్ దాడులతో నల్లసముద్ర రేవుల ద్వారా ధాన్యాల ఎగుమతి సామర్థ్యంలో ఇప్పటికే దాదాపు మూడో వంతు దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని సమకూర్చే ప్రధాన రంగమైన వ్యవసాయ ఎగుమతులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ ధాన్యాలు, వంటనూనెల ఎగుమతుల్లో తొంభై శాతానికి పైగా ఒడెస్సా ప్రాంతంలోని మూడు ప్రధాన సముద్ర రేవుల ద్వారానే జరుగుతున్నాయి. అయితే దాడుల భయంతో దేశంలోని 13 ప్రధాన ధాన్య ఎగుమతి టర్మినళ్లలో నాలుగు టర్మినళ్లు ఇప్పటికే కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేశాయి. భద్రతా పరిస్థితులు మరింత దిగజారడంతో కొన్ని అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు తమ నౌకలను ఉక్రెయిన్ రేవులకు పంపేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
యుద్ధంలో ఇరు దేశాలు ఒకదానికొకటి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా చమురు నిల్వలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగిస్తుండగా, దానికి ప్రతిగా రష్యా నల్లసముద్ర తీరంలోని రేవులు, ధాన్య ఎగుమతి కేంద్రాలపై దాడులను మరింత ఉధృతం చేసింది. బుధవారం కూడా ఒడెస్సా, మైకోలైవ్ ప్రాంతాల్లోని పోర్టు మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు జరిపినట్లు స్థానిక అధికారులు ధ్రువీకరించారు. ఈ పరిణామాలు ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.








