Mahaa Daily Exclusive

  విద్యార్థులే తెలంగాణ భవిష్యత్తు….

Share

విద్యార్థులే తెలంగాణ భవిష్యత్తు.
• ఆగస్టు 15లోపు 27.50 లక్షల మందికి ఎడ్యుకేషన్ కిట్లు.
• ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.08 లక్షల వ్యయం
• సీఎం రేవంత్ రెడ్డి.
వనపర్తి, మహా.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పలుగు, పార పట్టిన చేతులే కలాలు పట్టి తెలంగాణ భవిష్యత్తును మార్చాలని విద్యార్థులకు సూచించారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో నూతనంగా నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని బుధవారం ప్రారంభించిన అనంతరం విద్యార్థినులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సీఎం విద్యార్థులకు సూచించారు. చదువే భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అదే జీవితాల్లో వెలుగులు నింపి సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంచుతుందని అన్నారు. తల్లిదండ్రుల కలలను నిజం చేయాలంటే విద్యార్థులు కష్టపడి చదవాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 27.50 లక్షల మందికి తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో తొమ్మిది రకాల వస్తువులతో కూడిన ఈ కిట్లను అందజేయనున్నట్లు తెలిపారు. కిట్ల నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు వాట్సాప్ ద్వారా ప్రత్యేక వ్యవస్థను విద్యాశాఖ ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు.

గతంలో సరైన మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా విద్యారంగంలో మార్పు సాధ్యం కాదని, అందుకే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

విద్యారంగంలో మార్పులు ఒక్కటి, రెండేళ్లలో రావని, వ్యవస్థ పూర్తిగా బలోపేతం కావడానికి సమయం పడుతుందని సీఎం అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు 16 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు కల్పించామని, పదేళ్లుగా నిలిచిపోయిన బదిలీలను పూర్తి చేశామని గుర్తుచేశారు. 317 జీవో కారణంగా విడిపోయిన ఉపాధ్యాయ కుటుంబాలను మళ్లీ ఒకచోట చేర్చామని తెలిపారు.

ఉపాధ్యాయుల కృషి వల్లే రాష్ట్రం విద్యా రంగంలో పురోగతి సాధించిందని సీఎం ప్రశంసించారు. కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన పనితీరు గ్రేడింగ్ సూచీలో తెలంగాణ 36వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుందని తెలిపారు. అయితే ఈ పురోగతితో సంతృప్తి చెందకుండా దేశంలో తొలి రెండు స్థానాల్లో నిలిచే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.

ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసేందుకు ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపించామని, వచ్చే ఏడాది మరో 150 మంది ఉపాధ్యాయులను పంపనున్నట్లు సీఎం తెలిపారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కృత్రిమ మేధ విస్తరణ నేపథ్యంలో ఉద్యోగాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందువల్ల జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలతో పాటు నైపుణ్యాధారిత విద్యపై యువత దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల నుంచే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు తయారవ్వాలని సీఎం ఆకాంక్షించారు. చదువులో రాణించలేని వారు క్రీడల్లో ప్రతిభ చాటాలని, క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని పేర్కొంటూ, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Latest