Mahaa Daily Exclusive

  సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన….

Share

ఢిల్లీ, మహా.
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు అత్యవసరంగా స్పందించింది. నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆయనకు అందించిన వైద్య సేవలు, తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ప్రస్తుతం సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని, ఇప్పటికే సుమారు ఎనిమిదిన్నర కిలోల బరువు తగ్గారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉన్నందున అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని, అవసరమైతే ద్రవాహారం అందించేలా అధికారులను ఆదేశించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కోరారు.

ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించిన ఢిల్లీ హైకోర్టు, వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని తీవ్రంగా పరిగణించింది. ఆయన ఆరోగ్య పరిరక్షణ కోసం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాయో వివరించాలని ఆదేశించింది. అలాగే తక్షణ వైద్య సహాయం అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై కూడా సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించింది.

విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ ఈ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై హైకోర్టు తదుపరి విచారణలో సమీక్షించనుంది.

Latest