తాజ్ బంజారా ఇక జ్ఞాపకమే.
* కూల్చివేత పనులు వేగవంతం.
* 40 అంతస్తుల భవనానికి మార్గం.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ నగర ఆతిథ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన తాజ్ బంజారా హోటల్ త్వరలోనే చరిత్రలో కలిసిపోనుంది. బంజారాహిల్స్‌లో బంజారా సరస్సు ఒడ్డున నాలుగు దశాబ్దాలకుపైగా సేవలందించిన ఈ ప్రముఖ హోటల్ కూల్చివేత పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. హోటల్ స్థానంలో సుమారు 40 అంతస్తుల భారీ నివాస సముదాయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బంజారా సరస్సును ఆనుకుని ఉన్న 3.4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విలువైన ఆస్తిని అరబిందో రియాల్టీ సంస్థ రూ.315 కోట్లకు సొంతం చేసుకుంది. 2023లో హోటల్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో అధికారికంగా కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. తొలిదశలో భవనంలోని తలుపులు, కిటికీలు, విద్యుత్ పరికరాలు, ఫర్నిచర్‌ను తొలగించిన యంత్రాంగం ప్రస్తుతం ప్రధాన భవనాన్ని కూల్చే పనులను కొనసాగిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.
1979లో ప్రారంభమైన తాజ్ బంజారా హైదరాబాద్‌లో తొలి విలాసవంతమైన హోటళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, విదేశీ అతిథులకు ఇది ఎంతోకాలం ఆతిథ్యం అందించింది. నగర ఆతిథ్య రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ హోటల్ అనేక జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా నిలిచింది.
ప్రారంభ దశలో 1986 వరకు ఈ హోటల్‌ను ఐటీసీ గ్రూప్ నిర్వహించింది. అనంతరం దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తాజ్ జీవీకే హోటల్స్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగాయి. అయితే ఆర్థిక, పరిపాలనా కారణాలతో పాటు ఆస్తిపన్ను బకాయిల సమస్యలు హోటల్ భవిష్యత్తుపై ప్రభావం చూపాయి.
సుమారు రూ.1.43 కోట్ల ఆస్తిపన్ను బకాయిల కారణంగా 2023లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హోటల్‌ను సీల్ చేశారు. అనంతరం కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ భవనాన్ని పూర్తిగా తొలగించి, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 40 అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరానికి ఒకప్పుడు గుర్తింపుగా నిలిచిన తాజ్ బంజారా హోటల్ ఇక జ్ఞాపకాలకే పరిమితం కానుంది.








