Mahaa Daily Exclusive

  హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ వివాదంలో కన్‌స్ట్రక్షన్స్‌కు ఊరట… కఠిన చర్యలు వద్దని హైకోర్టు ఆదేశం…

Share

హైదరాబాద్, మహా.
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిలో నిర్మాణాలకు సంబంధించిన వివాదంలో ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ వ్యవహారంపై తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిర్మాణ సంస్థపై ఎలాంటి బలవంతపు లేదా కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.

సోమాజిగూడ నెక్లెస్ రోడ్ సమీపంలో ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టింది. అయితే ఈ నిర్మాణం హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తోందని పేర్కొంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భవన నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్–450 ప్రకారం జూలై 7న నోటీసులు జారీ చేసింది.

జీహెచ్‌ఎంసీ నోటీసులను సవాల్ చేస్తూ ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. నిర్మాణ పనులకు సంబంధించి ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది.

అదేవిధంగా ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ సమర్పించిన అనంతరం తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది.

హైకోర్టు తాజా ఆదేశాలతో చట్టపరమైన వివాదం కారణంగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టుకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లైంది. కేసు తుది విచారణ పూర్తయ్యే వరకు హైకోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు కొనసాగనున్నాయి.

Latest