Mahaa Daily Exclusive

  సమయాన్ని వృథా చేయకండి….

Share

  • సమయాన్ని వృథా చేయకండి
  • విద్యార్థుల నిరసనపై విచారణకు సుప్రీంకోర్టు నో
  • వీడియోలు చూసేంత సమయం తమకు లేదన్న సీజేఐ

న్యూఢిల్లీ, మహా : ఢిల్లీ వేదికగా విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘ఛలో సంసద్’ నిరసనలపై పోలీసులు జరిపిన బలప్రయోగంపై సుమోటోగా అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో తమ ప్రమేయం ఉండబోదని స్పష్టం చేస్తూ, సరైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. “మా సమయాన్ని వృథా చేయకండి, మీ సమయాన్ని కూడా వృథా చేసుకోవద్దు” అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) సంస్కరణలు, నీట్ పరీక్షల్లో అక్రమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు జూలై 20న ‘ఛలో సంసద్’ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు జరిపిన దౌర్జన్యాన్ని సుమోటోగా స్వీకరించాలని కోరుతూ బుధవారం బెంచ్ ఎదుట ఒక న్యాయవాది విజ్ఞప్తి చేశారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం దీనిపై స్పందించింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, నిరసనకారులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని న్యాయవాది వాదించేందుకు యత్నించారు. పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోలను కోర్టుకు సమర్పిస్తానని తెలిపినప్పటికీ ధర్మాసనం వినడానికి నిరాకరించింది. “వీడియోలపై మాకు ఆసక్తి లేదు, వాటిని చూసేంత సమయం మాకు లేదు” అని సీజేఐ స్పష్టం చేశారు.

అంతకుముందు రోజు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.కె. ఉపాధ్యాయ కూడా ఇలాంటి విజ్ఞప్తినే తోసిపుచ్చారు. “ఈ వ్యవహారాల్లోకి కోర్టులను లాగకండి” అని ఢిల్లీ హైకోర్టు సీజే వ్యాఖ్యానించారు.

అసలేం జరిగిందంటే …

జంతర్ మంతర్ వద్ద గత మూడు వారాలకు పైగా సాగుతున్న నిరాహార దీక్షకు కొనసాగింపుగా జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ‘ఛలో పార్లమెంట్’ ప్రదర్శన జరిగింది. వేలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. మధ్యాహ్న సమయంలో నిరసనకారులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లడంతో పోలీసులు నీటి వాయుగోళాలు ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు. ఈ దాడిలో నిరసనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం 100 మందికి పైగా గాయపడగా, పోలీసులు మాత్రం గాయపడిన వారి సంఖ్య 60 అని తెలిపారు. గాయపడిన 22 ఏళ్ల విద్యార్థిని ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఐసీయూలో తీవ్ర పరిస్థితిలో చికిత్స పొందుతోంది.

ఢిల్లీ పోలీసుల చర్యపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు తెలపడమే కాకుండా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, విద్యార్థులపై దాడికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కోరారు.

మరోవైపు 32వ రోజుకు చేరిన నిరసనల్లో సీజేపీ తమ డిమాండ్ల జాబితాను పొడిగించింది. సొనామ్ వాంగ్‌చుక్ విడుదల, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారంతో పాటు జూలై 20 నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.