- కాంగ్రెస్ చలో లోక్‌భవన్ ఉద్రిక్తం
- పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్
- నెక్లస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీ
- లోక్ భవన్ ఎదుట అడ్డుకున్న పోలీసులు
- పరిసర ప్రాంతాలలో స్వల్ప ఉద్రిక్తత
- కొడంగల్ లో నేతృత్వం వహించిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహా : ఢిల్లీలో మంగళవారం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో పాటు విపక్షనేతల అరెస్టును నిరసిస్తూ బుధవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో లోక్‌భవన్ ఉద్రిక్తంగా మారింది. ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ నుంచి లోక్‌భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ లోక్‌భవన్‌కు చేరుకున్న వెంటనే మంత్రులు, కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రులను నాంపల్లి పీఎస్‌లకు, మిగిలిన నాయకులు, కార్యకర్తలను పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు.
దేశం కోసం రక్తం చిందించడం
పదవుల త్యాగం రాహుల్ కుటుంబానికి కొత్త కాదు
కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్, మహా : దేశం కోసం రక్తం చిందించడం, పదవులను త్యాగం చేయడం గాంధీ కుటుంబానికి కొత్తేమీ కాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేంద్ర ప్రభుత్వ, పోలీసుల పాశవిక దాడిని ఖండించారు. నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ల అమ్మకాలు సాగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తన సొంత నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంలో ఏ ఎగ్జామ్ నిర్వహించినా పేపర్ లీకులు అవుతున్నాయని, దాంతో కోట్లాది విద్యార్థుల జీవితాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్ బీజేపీ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు.
జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు పోరాడుతుంటే, బాధ్యులపై చర్యలు తీసుకోకుండా విద్యార్థులపై పాశవిక దాడులు చేశారని మండిపడ్డారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచి, పార్లమెంటులో ధర్నా చేసిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై దాడులు చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. పేపర్ లీకేజీలపై జంతర్ మంతర్ వద్ద ప్రశ్నించిన విద్యార్థుల తలలు పగలగొట్టారని, బాధ్యుడైన ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీపై పోలీసులతో దాడి చేయించారని మండిపడ్డారు. యువత కోసం మోదీని గద్దె దించే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. 2019 ఇంటర్ ఫలితాల గోల్‌మాల్‌కు కేటీఆర్ బినామీ సంస్థ ‘గ్లోబరీనా’నే కారణమని, అది విద్యార్థుల ప్రాణాలను బలిగొందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ రోజే దానిపై చర్యలు తీసుకుంటే నీట్, సీబీఎస్‌ఈ పేపర్ లీకేజీలు జరిగేవి కావన్నారు. ఢిల్లీ బీజేపీ నేతలతో మాట్లాడి కేటీఆర్ ఆ సంస్థకు కాంట్రాక్టులు ఇప్పించారని విమర్శించారు.
రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తుంటే రక్తం కూడా వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. యువత పక్షాన, విద్యార్థులకు అండగా నిలిచేందుకు శాంతియుతంగా నిరసన తెలిపినా కేంద్రం అడ్డుకుంటుందని విమర్శించారు. పేపర్ లీక్ బాధ్యులపై చర్యలు తీసుకోని కేంద్ర ప్రభుత్వం, బాధితులైన విద్యార్థులపై మాత్రం లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. కేంద్రం చేసిన తప్పిదాలను రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని, ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాడుతోందని దేశం మొత్తం గమనిస్తుందన్నారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం యువత జీవితాలను గాలికొదిలేసి, కోట్ల రూపాయలు క్యాష్ చేసుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి, నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.








