రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామికం
*ప్రధాని మోదీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు
*కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
*కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి నాయక్
*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు
*కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా కారేపల్లి క్రాస్ రోడ్ లో రాస్తారోకో
కారేపల్లి, మహా: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోధీ నాయకత్వంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి నాయక్, సింగరేణి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కారేపల్లి క్రాస్ రోడ్ లో బుధవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం అప్రజా స్వామికమని ఖండించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరు సరికాదని ఆరోపించారు. పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై మోడీ ప్రభుత్వం లాఠీ చార్జి చేపించడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసు బలగాలతో దౌర్జన్యంగా అరెస్టు చేయించిన తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసనకారులను ఇబ్బంది పెట్టే చర్యలు సరికావని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటే వాటిని పట్టించుకోకుండా ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం సరికాదన్నారు. ఈ రాస్తారోకో లో కాంగ్రెస్ నాయకులు అడ్డగోడ ఐలయ్య, పెద్దబోయిన ఉమాశంకర్, సూరపురెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మేదరి టోనీ, ఎండి అనీఫ్,ఆదర్ల రాములు, ఈసాల ఛాయాదేవి, భీముడు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రంజిత్ కుమార్, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.








