Mahaa Daily Exclusive

  నీట్ రద్దే శాశ్వత పరిష్కారం….

Share

నీట్ రద్దే శాశ్వత పరిష్కారం.
* కేంద్రానికి తమిళనాడు సీఎం విజయ్ డిమాండ్.
చెన్నై, మహా.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని స్పష్టం చేశారు. ఢిల్లీలో నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

ఆందోళనలో పాల్గొన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని విజయ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అణచివేయడం సమంజసం కాదని, విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.

నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలంటే విద్యను తిరిగి రాష్ట్ర జాబితా పరిధిలోకి తీసుకురావాల్సిందేనని విజయ్ అభిప్రాయపడ్డారు. అదే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. ఒకవేళ రాజ్యాంగపరమైన లేదా చట్టపరమైన అడ్డంకులు ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించేలా తాత్కాలికంగా ప్రత్యేక ఉమ్మడి జాబితా ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల సాధారణ విద్యతో పాటు వైద్య విద్యకు సంబంధించిన నిర్ణయాల్లో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని చెప్పారు. తమ పార్టీ ఆవిర్భావం నుంచే ఇదే విధానాన్ని ప్రతిపాదిస్తున్నామని విజయ్ గుర్తు చేశారు.

ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. అనంతరం పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడంతో వేలాది మంది ఆందోళనకారులు ఢిల్లీకి చేరుకున్నారు.

పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, లాఠీచార్జ్ నిర్వహించడం వల్ల పలువురు విద్యార్థులు, నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

మరోవైపు, ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిరసనకారుల ప్రతినిధులతో చర్చలు జరిపింది. తమ డిమాండ్లపై సానుకూల స్పందన లభించిందని ఆందోళనకారులు వెల్లడించినప్పటికీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం ప్రధాన డిమాండ్‌గా కొనసాగుతోంది. ఇదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమై పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను అణచివేయడం కాకుండా, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.