గోదావరి–కావేరీ అనుసంధానంపై చంద్రబాబు కీలక చర్చలు.
* భాగస్వామ్య రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటు చేయాలని జల్‌శక్తి మంత్రికి విజ్ఞప్తి.
ఢిల్లీ, మహా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ప్రాజెక్టుకు సంబంధించి భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు.
సమావేశంలో శ్రీశైలం మార్గం కంటే బనకచర్ల మార్గం ద్వారా కావేరీ అనుసంధానం చేపట్టడం మరింత అనుకూలంగా ఉంటుందని కేంద్ర జల్‌శక్తి శాఖ సూచించినట్లు తెలిసింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని భాగస్వామ్య రాష్ట్రాలతో సమగ్ర చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
గోదావరి జలాలు సముద్రంలో వృథాగా కలిసిపోవడం కంటే వాటిని అవసరమైన ప్రాంతాలకు మళ్లించి సద్వినియోగం చేసుకోవడం దేశ ప్రయోజనాలకు అనుకూలమని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు సమాచారం. కేంద్రం ప్రతిపాదించే కార్యాచరణకు అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అందుకోసం కేంద్రం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన కేంద్ర జల్‌శక్తి శాఖ, భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టు దిశగా ఈ సమావేశం కీలక ముందడుగుగా భావిస్తున్నారు.







