Mahaa Daily Exclusive

  ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ…

Share

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ.
* భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం.
* ఆగస్టు 1న కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని.
* ఏర్పాట్ల కోసం నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు
ఢిల్లీ, మహా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 1న జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.

పార్లమెంట్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మౌలిక సదుపాయంగా మారుతుందని, ప్రారంభోత్సవానికి హాజరై రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించాలని వారు ప్రధానిని కోరినట్లు తెలిసింది.

మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించేందుకు నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర, రాజమహేంద్రవరం కమిషనర్ రాహుల్ మీనా, గుంటూరు కమిషనర్ మయూర్ అశోక్ ప్రజా సౌకర్యాలు, పారిశుద్ధ్యం, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. వీరికి సహకరించేందుకు మరో 26 మంది నాన్-క్యాడర్ అధికారులను నియమించగా, వారు విజయనగరం జిల్లా కలెక్టర్ సమన్వయంతో విధులు నిర్వహించనున్నారు.

విజయనగరం జిల్లాలో నిర్మితమవుతున్న ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందిన తరహాలోనే భోగాపురం ప్రాంతం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడం ద్వారా పెట్టుబడులు పెరగడంతో పాటు వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.