గాంధీ భవన్ ముట్టడికి యత్నం.
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అరెస్ట్.
* నాంపల్లిలో ఉద్రిక్తత.. పరస్పర ఆరోపణలు.
* రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపు.
హైదరాబాద్, మహా.
కాంగ్రెస్ పార్టీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరును నిరసిస్తూ గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపునివ్వడంతో బుధవారం నాంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ భవన్ వైపు ర్యాలీగా బయలుదేరిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావుతో పాటు పలువురు పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాంచందర్‌రావును గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగగా, పోలీసులతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రజా సమస్యలపై సభలో చర్చించకుండా కాంగ్రెస్ నాయకత్వం వీధి నిరసనలకు దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ చర్చకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు కాంగ్రెస్ ప్రోత్సాహం ఇస్తోందని, అలాంటి రాజకీయాలను ప్రజల్లో ఎండగట్టేందుకే గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చామని తెలిపారు.
రాంచందర్‌రావు అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ కూడా సభలోనే చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ సభను వదిలి వీధుల్లో ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన బాధ్యతను విస్మరించి రాజకీయ నాటకాలకు కాంగ్రెస్ తెరలేపిందని ఆరోపించారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ తదితరులు రాంచందర్‌రావు అరెస్టును ఖండిస్తూ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అరెస్టు చేసిన బీజేపీ నాయకులను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్‌రావు ఆరోపించారు. ఈ ఘటనలో ఒక టెలివిజన్ ఛానల్ ప్రతినిధి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ రాజ్యాన్ని నడుపుతోందని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అయితే బీజేపీ చేసిన ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఘటన నేపథ్యంలో నాంపల్లి పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.








