వరంగల్, బ్యూరో మహా;
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఎనుమాముల 14వ డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన పెట్రోల్ దాడిలో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అడుప మహేష్ కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో కలిసి వారి నివాసంలో పరామర్శించారు.
ఈ సందర్భంగా మహేష్ కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచిస్తూ, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
మంత్రి వెంట వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు అయూబ్, రాష్ట్ర యువ నాయకులు గోపాల నవీన్ రాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.








