Mahaa Daily Exclusive

  కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన మంత్రి, డిసిసి అధ్యక్షుడు ఇనగాల..

Share

*కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన మంత్రి, డిసిసి అధ్యక్షుడు ఇనగాల*

*విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని హితవు పలికిన ఇనగాల*

*సంక్షేమ హాస్టల్ లో ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమం విద్యార్థులతో ముఖాముఖి*

హనుమకొండ మహా ;

ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల గళాన్ని వినిపించేందుకు ఛాత్రోంకీ గూంజ్ (విద్యార్థుల గర్జన) కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం హనుమకొండ ఇందిరానగర్ లోని సంక్షేమ శాఖ బాయ్స్ హాస్టల్ లో మరియు కిషన్ పుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యార్థుల సదస్సుల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మంత్రి పొన్నం ప్రభాకర్, హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కె. ఆర్. నాగరాజు, ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్స్, డివిజన్ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు మీ అందరి మధ్యలో నిలబడి మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని, మీ కళ్లలో కనిపిస్తున్న ఉత్సాహం, మీ ముఖాల్లోని చిరునవ్వులు చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. మీరు కేవలం ఒక హాస్టల్‌ లో ఉంటున్న విద్యార్థులు మాత్రమే కాదు… ఈ దేశానికి కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, గొప్ప నాయకులని, ఈ వయసు చాలా విలువైనది, హైస్కూల్ దశ అనేది మీ జీవితానికి పునాది లాంటిది. ఇక్కడ మీరు నేర్చుకునే క్రమశిక్షణ, అలవాట్లు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేస్తోందని మండిపడ్డారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నీట్’ పరీక్ష పేపర్ లీకేజీ కావడం కేంద్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని, విద్యా మాఫియాకు కొమ్ముకాస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థుల కలలను దెబ్బతీస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని, విపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేయించారని విమర్శించారు. విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, అవినీతి మయమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
భారత జాతీయ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేపట్టిన ఛాత్రోన్ కీ గూంజ్ విద్యార్థుల గొంతుక ఉద్యమం ద్వారా దేశంలో విద్యావ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యమవు తుందో మేము ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని, తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఢిల్లీలో శాంతియుతంగా పార్లమెంట్ వైపు మార్చ్ చేసిన వేలాది మంది విద్యార్థులపై ఈ ప్రభుత్వం పోలీసు బలగాలతో దాడులు చేయించింది. ఎంతో మంది విద్యార్థులు గాయపడ్డారు, విద్యార్థినులను కనీస గౌరవం లేకుండా వేధించారు. ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అని గత 12 ఏళ్లలో దేశంలో కనీసం 152 పేపర్ లీక్ సంఘటనలు జరిగాయి. దీనివల్ల 7.5 కోట్ల మంది విద్యార్థుల శ్రమ, వారి కుటుంబాల జీవితకాల పొదుపు బూడిదలో పోసిన పన్నీరైంది. ఇది కేవలం ఒక సాధారణ మోసం కాదు, విద్యార్థులపై జరుగుతున్న వ్యవస్థీకృత ఆర్థిక నేరం. వైద్య ప్రవేశ పరీక్ష అయిన ‘నీట్’ ను ఈ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని, ఏఐపిఎంటి 2015 నుండి మొదలుకొని నిన్నటి నీట్-యుజి 2026 వరకు కనీసం ఐదు ప్రధాన లీకులు, అక్రమాలు జరిగాయి. ‘రీ-నీట్’ పెట్టినా విద్యార్థులకు నమ్మకం కలగలేదని, అందుకే 2.7 లక్షల మంది పరీక్షకు రాలేదని ఈ సందర్భంగా అన్నారు. ఓయమ్మార్ షీట్లలో మార్పులు చేసి విద్యార్థుల మార్కులను ఇష్టారాజ్యంగా మార్చేశారు. ఒక్క మహారాష్ట్ర టెట్ ఏంటి, యు జి సి- నెట్ ఏంటి..ఏ పరీక్ష చూసినా లీకేజీ లేనని అన్నారు.
జాతీయ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేడు ఒక ‘నమ్మకం లేని సంస్థ’ గా మారిందని తెలిపారు. అలాగే ప్రతి రిక్రూట్‌మెంట్‌ లో విపరీతమైన జాప్యం జరుగుతోందని, పాత నోటిఫికేషన్ల ఫలితాలు ఇవ్వకుండానే కొత్త నోటిఫికేషన్లు ఇస్తూ యువత విలువైన సంవత్సరాలను ప్రభుత్వం నాశనం చేస్తోందని ఈ సందర్భంగా అన్నారు. భారతదేశ యువతకు అండగా నిలిచినందుకు ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం మన రాజ్యాంగాన్ని అవమానించడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన తీవ్రమైన దాడి. జవాబు దారీతనాన్ని డిమాండ్ చేస్తున్న విద్యార్థుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం తీవ్ర ఆందోళనకరం. నీట్ వైఫల్యానికి కారణమైన వారిని ఖచ్చితంగా బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు.