Mahaa Daily Exclusive

  మంత్రులు పనితీరుపై మరింత దృష్టి పెట్టాలి.:సీఎం చంద్రబాబు.

Share

అమరావతి, మహా.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,120 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను మరోసారి సమగ్రంగా అధ్యయనం చేసి కేబినెట్ ముందుకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖలో నిజంగా అవసరమైన ఉద్యోగాలపై పునఃసమీక్ష నిర్వహించి సవరించిన ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

మంత్రులు తమ శాఖల పనితీరుపై మరింత దృష్టి సారించాలని, ప్రజలకు కనిపించే విధంగా ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో మంత్రులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించిన తర్వాత ఆ నిర్ణయాన్ని ప్రజలకు వివరించే బాధ్యతను ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేస్తే అనేక సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు అన్నారు. ఇద్దరూ కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదించిన ప్రాజెక్టులను జిల్లా స్థాయిలో నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. అలాగే ప్లానింగ్ బోర్డు సమావేశాలను తరచూ నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై క్రమం తప్పకుండా సమీక్షలు చేపట్టాలని సూచించారు.

ప్రతి మంత్రి తమ శాఖలోని సమస్యలను స్వయంగా పరిష్కరించే దిశగా చొరవ చూపాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలపై మంత్రులు మీడియా సమావేశాలు నిర్వహించినప్పటికీ, వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో లోపాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన ఘటన, తిరుపతిలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసుల్లో సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించగలిగామని సీఎం చెప్పారు. డీఎస్సీ పరీక్షల అంశంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ప్రజలు విశ్వసించలేదని, న్యాయస్థానంలోనూ వారికి అనుకూల తీర్పు రాలేదని వ్యాఖ్యానించారు. అదే అంశాన్ని ఢిల్లీలో జరిగిన నీట్ ఉద్యమంతో ముడిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇలాంటి అంశాల్లో మంత్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలు, పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశముందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే పోలవరం ప్రారంభోత్సవం, గోదావరి పుష్కరాల ప్రారంభ కార్యక్రమాలను ఒకే రోజు కాకుండా విడివిడిగా నిర్వహిస్తే మంచిదని మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశంలో సూచించినట్లు సమాచారం.