- మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం విషమం!
- వెంటిలేటర్‌పై చికిత్స.. స్పందించని నాడీ వ్యవస్థ!
హైదరాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి (54) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జి.విజయ్‌కుమార్ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.పెద్ది సుదర్శన్‌రెడ్డి తొలుత వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం (పల్మనరీ ఎంబోలిజం) కారణంగా రక్తపోటు తీవ్రంగా పడిపోయి,గుండె స్పందన నిలిచినట్లు వైద్యులు తెలిపారు.దాదాపు 45 నిమిషాలపాటు సీపీఆర్, ఏసీఎల్‌ఎస్ పద్ధతుల్లో అత్యవసర చికిత్స అందించి గుండె స్పందనను పునరుద్ధరించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు.
క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాల నిపుణులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్ స్వల్ప మద్దతుతో శ్వాసక్రియ, రక్తపోటు కొనసాగుతున్నప్పటికీ, సుదీర్ఘంగా గుండె స్పందన నిలిచిపోవడంతో నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.ఈఈజీ, ఎంఆర్‌ఐ,టీసీడీ పరీక్షల్లో మెదడుకు ఆక్సిజన్ అందక ఏర్పడిన నష్టం గుర్తించినట్లు తెలిపారు.శబ్దం,స్పర్శకు ఆయన స్పందించడం లేదన్నారు.వైద్య ప్రమాణాల ప్రకారం బుధవారం 72 గంటల న్యూరో అసెస్‌మెంట్ నిర్వహించి మెదడు పనితీరును మరోసారి అంచనా వేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నాయి.








