- ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందే
- లేదంటే మళ్ళీ ఉద్యమిస్తాం
- విద్యార్థులపై వేధింపులు ఆపాలన్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే
- ఎంపీ కంగనా రనౌత్ మాటలకు విలువ లేదన్న దిప్కే
న్యూఢిల్లీ, మహా : నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై నిరనసలు తెలిపిన విద్యార్థులపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు వెంటనే నిలిపివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేసింది. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే త్వరలోనే మరోసారి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే హెచ్చరించారు. దిల్లీ విమానాశ్రయం వద్ద బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తమ భవిష్యత్తు, హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్, పెలెట్ గన్స్ వంటి చర్యలు తీసుకోవడం తీవ్రంగా ఖండించారు.
జులై 20న జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై బలప్రయోగం జరిగిందని అభిజీత్ దీప్కే ఆరోపించారు. వారిని ఉగ్రవాదుల మాదిరిగా పెల్లెట్ గన్స్‌తో లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వం ఇలాంటివి చేయకూడదని, విద్యార్థులు తమ భవిష్యత్, హక్కుల కోసం పోరాడుతున్నారన్నారు. వారిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం తగదని తెలిపారు. ఇలాగే వేధించడం కొనసాగిస్తే మళ్లీ ప్రజల్లోకి వెళ్లి ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. మరోసారి ఆందోళన చేపడతారా? అనే ప్రశ్నకు స్పందించిన దిప్కే, ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే తప్పకుండా మరో ఉద్యమం ఉంటుందని చెప్పారు. అది త్వరలోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జెన్-జెడ్ యువతపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై దిప్కే స్పందించారు. ఆమె వ్యాఖ్యలను ఎవరు సీరియస్‌గా తీసుకుంటారని కొట్టిపారేశారు.
విద్యార్థులపై వేధింపులు ఆపాలి
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ ఆందోళన విరమణ తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పితే దేశవ్యాప్తంగా “ఊహించని స్థాయిలో” మళ్లీ నిరసనలు ప్రారంభిస్తామని సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా స్పష్టం చేశారు. తమ పార్టీ సీనియర్ నాయకురాలు ఐషే ఘోష్‌తో పాటు నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై వేధింపులు వెంటనే నిలిపివేయాలన్నారు. జంతర్ మంతర్ వద్ద 36 రోజుల పాటు సాగిన ఆందోళనను ఉపసంహరించుకునే సమయంలో ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహనను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. “ఐషే ఘోష్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా, ప్రభుత్వం మునుపెన్నడూ చూడని రీతిలో ఆందోళనను ఎదుర్కోవాల్సి వస్తుంది. మా బృందాన్ని వేధించడం ఆపి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండండి” అని అశుతోష్ రాంకా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు. ఆందోళనకారులు, నిర్వాహకులపై దేశవ్యాప్తంగా నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో కొత్తగా కేసులు నమోదు చేయబోమని జూలై 25న జరిగిన మూడో విడత చర్చల్లో ప్రభుత్వం అంగీకరించిందని రాంకా గుర్తుచేశారు. కేంద్రంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు ముసాయిదా ఒప్పందాన్ని అందించామని, చట్టపరమైన సంప్రదింపుల తర్వాత లిఖితపూర్వక హామీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. ఢిల్లీతో పాటు బిహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ వందలాది మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.








