వందేమాతరానికి చట్టబద్ధ రక్షణ.
• రాజ్యసభ ఆమోదం.. అవమానిస్తే కఠిన చర్యలు.
ఢిల్లీ, మహా.
జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ నెల 24న ఎగువసభలో ప్రవేశపెట్టిన బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడం, లేదా ఎవరైనా ఆలపిస్తున్న సమయంలో కావాలనే ఆటంకం కలిగించడం చట్టప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణించనున్నారు.
ఈ బిల్లు ద్వారా ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్–1971’లో కీలక సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం భారత జాతీయ గీతం ‘జనగణమన’కు అమల్లో ఉన్న చట్టపరమైన రక్షణలను జాతీయ గేయమైన ‘వందేమాతరం’ కు కూడా విస్తరించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది.
చట్ట సవరణల అనంతరం జాతీయ గేయం ఆలపించే సమయంలో దానికి గౌరవం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా అంతరాయం కల్పించడం, అవమానకరంగా ప్రవర్తించడం వంటి చర్యలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుంది. దేశ గౌరవ చిహ్నాల పరిరక్షణకు ఈ సవరణలు మరింత బలం చేకూరుస్తాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
రాజ్యసభ ఆమోదం అనంతరం ఈ బిల్లు లోక్సభ ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత చట్టంగా అమల్లోకి రానుంది. దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేయడం, జాతీయ గేయానికి సముచిత గౌరవాన్ని కల్పించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది.








