Mahaa Daily Exclusive

  జనసంద్రంగా మారిన నర్సంపేట…….

Share

  • జనసంద్రంగా మారిన నర్సంపేట
  • ఉద్యమ నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం
  • అశ్రునయనాల మధ్య పెద్ది అంతిమయాత్ర
  • స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపార వర్గాలు
  • భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
  • సాయంత్రం స్వగ్రామం నల్లబెల్లి లో అంత్యక్రియలు

వరంగల్, మహా;

స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఓ ఉద్యమ కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు నర్సంపేట జనసంద్రంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు, ఉద్యమ సహచరులు, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు నర్సంపేట కు తరలివస్తున్నారు. ఎటు చూసినా జన సందోహమే కనిపిస్తుండగా, పట్టణమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని చివరిసారి చూసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. ఆయనతో కలిసి ఉద్యమంలో నడిచిన సహచరులు, అభిమానులు, సాధారణ ప్రజలు భావోద్వేగానికి గురై కన్నీరుమున్నీరవుతున్నారు. “ప్రజల మనిషిని కోల్పోయామని ఇక మా ఉద్యమ యోధుడు ఇక లేరు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*బందుకు పిలుపునిచ్చిన నర్సంపేట వ్యాపార వర్గాలు*

పెద్ది మృతికి నివాళిగా నర్సంపేట పట్టణంలోని వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేసి ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా అంతిమయాత్రలో పాల్గొనేందుకు తరలిరావడంతో నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.

*పెద్ది అందరికీ ఆత్మీయుడే..*

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి సంతాపంగా నివాళులు
అర్పించేందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, ఉద్యమకారులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి కన్నీళ్లతో బరువెక్కిన హృదయం తో నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను, నర్సంపేట ప్రజలతో ఆయనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం ఆయన స్వగ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించనున్నారు. అంతిమయాత్రలో పాల్గొనేందుకు వేలాదిమంది ఇప్పటికే నల్లబెల్లికి చేరుకుంటున్నారు. తెలంగాణ తల్లి తన ఉద్యమ బిడ్డకు అశ్రునయనాల మధ్య కడసారి వీడ్కోలు పలికి తన ఒడికి చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది.