- తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
- తల్లిపాలు శిశువు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం
- వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్య శారద
వరంగల్, మహా ;
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1వతేది నుంచి 7 వరకు వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు, మీడియా నోట్, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.
ఇటీవల సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి గుర్తించిన లోపాలను పరిశీలించి, సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని, గుర్తించిన ప్రతి లోపాన్ని నిర్దిష్ట గడువులోగా సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తల్లిపాలు ప్రతి శిశువు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం, సంపూర్ణ పోషకాహారమని పేర్కొన్నారు. పుట్టిన గంటలోపే తల్లిపాలను ప్రారంభించడం, తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వడం, అనంతరం వయస్సుకు తగిన అనుబంధ ఆహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం ద్వారా శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు.
జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్లు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి ఆరు నెలల లోపు శిశువుల తల్లులు, రెండు సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుత జనరేషన్ కు తల్లిపాల పై ఉన్న అపోహలను తొలగిస్తూ సరైన కౌన్సెలింగ్ అందించాలని, కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రసవించిన ప్రతి శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలను ప్రారంభించేలా వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాలు, వార్డుల్లో అవగాహన సమావేశాలు, ఇంటింటి సందర్శనలు, కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలు నిర్వహించి తల్లిపాల ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రాజమణి, సీడీపీఓలు, సూపర్వైజర్లు, పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








