Mahaa Daily Exclusive

  ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి భోగాపురం ప్రవేశద్వారం….

Share

ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి భోగాపురం ప్రవేశద్వారం.
• స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో చారిత్రక మైలురాయి.
• ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

భోగాపురం,మహా.

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు నేడు రూపం దక్కిందని, భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం జాతికి అంకితం కావడం నవ్యాంధ్ర అభివృద్ధి ప్రయాణంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు. భోగాపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని వారు పేర్కొన్నారు.

స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది కేవలం విమాన ప్రయాణాలకు పరిమితమైన ప్రాజెక్టు కాదని, ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరినిచ్చే అభివృద్ధి కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు బలమైన పునాదని పేర్కొంటూ, ఈ విమానాశ్రయం ద్వారా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఐటీ, పర్యాటకం, లాజిస్టిక్స్, తయారీ, ఎగుమతుల రంగాలు మరింత వేగంగా అభివృద్ధి చెందనున్నాయని చెప్పారు. ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ, ఆధునిక కార్గో సదుపాయాలతో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును రూపుదిద్దినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు అందించిన రైతుల త్యాగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ముఖ్యమంత్రి, వారి సహకారం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. రైతుల సంక్షేమాన్ని పరిరక్షిస్తూనే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

ప్రకటనలు చేయడం కాదు, ప్రజలకు శాశ్వత ప్రయోజనం చేకూర్చే మౌలిక సదుపాయాల నిర్మాణమే నిజమైన అభివృద్ధి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టడం గిరిజన పోరాట స్ఫూర్తికి దేశం ఇచ్చిన గౌరవమని పేర్కొన్నారు. స్వేచ్ఛ, స్వాభిమానం కోసం అల్లూరి సాగించిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మౌలిక వసతుల అభివృద్ధిలో అపూర్వమైన పురోగతి సాధిస్తోందని, రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారం అభివృద్ధి వేగాన్ని మరింత పెంచిందని అన్నారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా పరిశ్రమలు, పర్యాటకం, సేవారంగంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని, యువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ఒకప్పుడు భోగాపురం విమానాశ్రయాన్ని విమర్శించిన వారే నేడు దాని అవసరాన్ని అంగీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్లే ప్రపంచ స్థాయి విమానాశ్రయం రికార్డు సమయంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రను ఐటీ, తయారీ, సేవా, లాజిస్టిక్స్ రంగాలకు ప్రధాన కేంద్రంగా మార్చడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతుల సేవలను మరోసారి స్మరించుకున్న ఆయన, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.