విద్వేషపూరిత ప్రసంగాల నిరోధానికి చట్టం.
* త్వరలో సెలక్ట్ కమిటీ నివేదిక.
* అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా నివేదిక సమర్పణ లక్ష్యం.
* భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగదన్న మంత్రి పొన్నం
హైదరాబాద్, మహా.
తెలంగాణ అసెంబ్లీలో విద్వేషపూరిత ప్రసంగాలను నిరోధించేందుకు రూపొందిస్తున్న చట్టానికి సంబంధించి ఏర్పాటైన సెలక్ట్ కమిటీ సమావేశం శనివారం అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో జరిగింది. సెలక్ట్ కమిటీ చైర్మన్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హేట్ స్పీచ్ బిల్లు, క్రైమ్ బిల్లుతో పాటు పలు కీలక అంశాలపై సభ్యులు చర్చించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసేలోగా కమిటీ నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించే దిశగా కార్యాచరణ రూపొందించారు.
ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు కమిటీ సభ్యులు దానం నాగేందర్, మధుసూదన్ రెడ్డి, యశస్విని రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కోవా లక్ష్మి, కూనంనేని సాంబశివరావు, మాణిక్రావు హాజరయ్యారు. సమావేశంలో హేట్ స్పీచ్ బిల్లు, క్రైమ్ బిల్లు ప్రతులను మరోసారి సభ్యులందరికీ కమిటీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ అందజేశారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, వారం రోజుల్లో మరోసారి సెలక్ట్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తదుపరి సమావేశంలో కమిటీ సభ్యులందరి నుంచి సూచనలు, అభిప్రాయాలు స్వీకరించి తుది నివేదికను రూపొందిస్తామని చెప్పారు.
తెలంగాణ శాసనసభలో విద్వేషపూరిత ప్రసంగాలను నిరోధించేలా సమగ్ర చట్టాన్ని తీసుకురావడమే కమిటీ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలతో పాటు సమాజంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందిస్తామని తెలిపారు. వ్యక్తుల గౌరవాన్ని పరిరక్షించేలా, సమాజంలో సామరస్యాన్ని పెంపొందించేలా కమిటీ సిఫార్సులు ఉంటాయని చెప్పారు.
అదే సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా చట్టాన్ని రూపొందించే విషయంలో ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ విద్వేషపూరిత వ్యాఖ్యలను అరికట్టేలా చట్టానికి తుది రూపు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.








