సౌత్ కోస్టల్ రైల్వే జీఎంతో విజయవాడ ఎంపీ శివనాథ్ భేటీ.
* కొండపల్లి స్టేషన్ అభివృద్ధితో పాటు విజయవాడ రైల్వే ప్రాజెక్టులపై చర్చ.
* 8 ఆర్వోబీల నిర్మాణానికి విజ్ఞప్తి.
విజయవాడ, మహా.
సౌత్ కోస్టల్ రైల్వే జనరల్ మేనేజర్ మాథుర్‌ను విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ నగరం, పరిసర ప్రాంతాలకు సంబంధించిన పలు కీలక రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఎంపీ వెల్లడించారు.
కొండపల్లి రైల్వే స్టేషన్‌ను కూడా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేయాలని జీఎంను కోరినట్లు శివనాథ్ తెలిపారు. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైల్వే సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఎనిమిది రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్వోబీలు) నిర్మాణం అత్యవసరమని వివరించినట్లు పేర్కొన్నారు.
ఎర్రకట్ట రైల్వే ఓవర్ బ్రిడ్జి పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల ప్రజలకు అత్యంత కీలకమని జీఎంకు వివరించినట్లు ఎంపీ తెలిపారు. అదేవిధంగా గుణదల ఎల్సీ–8 వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా అత్యవసర అవసరమని కోరినట్లు చెప్పారు.
విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు టెండర్లు పిలిచినా స్పందన రాలేదని అధికారుల నుంచి సమాచారం అందిందని శివనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రిని రాష్ట్ర ఎంపీలందరూ కలిసి విజయవాడ రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు.
అలాగే విజయవాడ–బెంగళూరు మధ్య గుత్తి మీదుగా కొత్త రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర రైల్వే మంత్రిని కోరనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ రైల్వే ప్రాజెక్టు అమలైతే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య రైల్వే అనుసంధానం మరింత బలోపేతం కావడంతో పాటు ప్రయాణికులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.







