Mahaa Daily Exclusive

  ప్రాణం పోసిన రోడ్డుపై గుంత…

Share

  • ప్రాణం పోసిన రోడ్డుపై గుంత
  • సినిమాను తలపించే అరుదైన ఘటన..!

ఏలూరు, మహా : చనిపోయిందని వైద్యులు చెప్పారు. అంబులెన్స్ లో తీసుకెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంత ప్రాణం పోసింది. సినిమాను తలపించేలా నమ్మశక్యం కానీ ఓ అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గురజాల రామతులసి కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల ఆరోగ్యం క్షిణించడంతో కుటుంబ సభ్యులు ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. అక్కడి వైద్యులు వెంటిలేషన్ ఏర్పాటు చేసి సిపిఆర్ తో సహా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆమె చనిపోయినట్లుగా నిర్ధారించారు. కాగా కుటుంబ సభ్యులు దుఃఖ సంద్రంలో మునిగి ఆమె మృతదేహాన్ని ఆంబులెన్స్ లో స్వగ్రామానికి తీసుకెళ్తున్నారు.

అప్పటికే గ్రామంలో దహన సంస్కారాల కోసం ఏర్పాట్లు చేయడం, బంధువులు కడసారి చూపుకు చేరుకోవడం, సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వచ్చాయి. కాగా ఆమె పార్దివ దేహాన్ని అంబులెన్స్ లో స్వగ్రామానికి తీసుకెళ్తుండగా మండవల్లి మండలం పులపర్రు వద్దకు చేరుకున్న సమయంలో అంబులెన్స్ డ్రైవర్ రోడ్డుపై వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న గుంతలోకి దిగబడింది. దాంతో అనూహ్యంగా శవంగా పడి ఉన్న రామతులసి శరీరంలో ఒక్కసారిగా చలనం వచ్చింది. ఆమె కదలికలను గమనించిన బంధువులు వెంటనే ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. విజయవాడ ఆస్పత్రిలో అత్యవసర విభాగ వైద్యులు ఆమెను పరీక్షించి ఐసీయూలో పర్యవేక్షణలో ఉంచారు. వైద్యుల ఫలితంగా ఆమె ప్రాణాలతో బయటపడింది. దాంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వింత ఘటన తెలియగానే గ్రామంలో ఏర్పాటు చేసిన నివాళి ఫ్లెక్సీలను, సోషల్ మీడియా పోస్టులను వెంటనే తొలగించారు. రోడ్డుపై ఉన్న గుంత ఆమెను కాపాడిందని, ప్రాణాలు పోసిందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ వార్త ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.