‘క్యూర్’ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భారీ స్పందన.
* 10 రోజుల్లో 20 వేల దరఖాస్తులు.
* రూ.660 కోట్లతో 16 టవర్ల నిర్మాణానికి టెండర్లు.
* ఈ నెలాఖరులో పనుల ప్రారంభానికి సన్నాహాలు
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన పది రోజుల్లోనే సుమారు 20 వేల దరఖాస్తులు అందాయి. ఇదే ఊపులో ఈ నెల 10 వరకు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యాచరణ వేగవంతం చేసింది. ఇందుకోసం పది ప్యాకేజీల్లో రూ.660 కోట్ల అంచనా వ్యయంతో 16 టవర్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఈ నెలాఖరులోపు నిర్మాణ పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జూలై 21 నుంచి రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, బహదూర్‌పురా, అంబర్‌పేట్, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
దరఖాస్తుదారుల సౌకర్యార్థం మీసేవ దరఖాస్తు విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. చిరునామా ధ్రువీకరణకు ఆధార్‌తో పాటు ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలను కూడా అనుమతించింది. దీంతో ఆధార్‌లో స్వస్థల చిరునామా ఉన్నా, హైదరాబాద్‌లోని ఇతర గుర్తింపు పత్రాలతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఒక కుటుంబం నుంచి ఒక్కరే దరఖాస్తు చేయాలని స్పష్టం చేసింది.
దరఖాస్తుతో పాటు రూ.10 వేల ఈఎండీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 19వ తేదీ వరకు కాంట్రాక్టర్ల నుంచి టెండర్ బిడ్లు స్వీకరించనున్నారు. హైదరాబాద్ జిల్లాలో 3,500, మేడ్చల్ జిల్లాలో 1,920, రంగారెడ్డి జిల్లాలో 1,920 ఫ్లాట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. పదంతస్తుల టవర్లలో ఒక్కో అంతస్తుకు 12 ఫ్లాట్ల చొప్పున 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించనున్నారు.
ఈ పథకం కింద స్థలం, రూ.5 లక్షల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుండగా, లబ్ధిదారులు సుమారు రూ.6 లక్షలు నాలుగు విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. కేటాయించిన ఫ్లాట్‌ను పదేళ్లపాటు అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం నిషేధం అని హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది. ఫ్లాట్‌ను ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందజేస్తుందని, అవసరమైతే బ్యాంకులో తనఖా పెట్టుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
మహిళలకు 30 శాతం, ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు హౌసింగ్ బోర్డు వెల్లడించింది.
ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేస్తే ఇతర ప్రభుత్వ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే ఈఎండీగా చెల్లించే రూ.10 వేల మొత్తాన్ని ఇళ్లు కేటాయించకపోతే రెండు రోజుల్లోనే తిరిగి చెల్లిస్తామని, కేటాయిస్తే లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తామని తెలిపింది. పథకానికి సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.







