Mahaa Daily Exclusive

  ప్రభుత్వ పథకాలు గడప గడపకు చేరాలి..!

Share

  • ప్రజా పాలన విజయోత్సవాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలి
  • అన్ని శాఖలు ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలు జరపాలి
  • 30న మహబూబ్ నగర్ లో రైతు దినోత్సవం సభ
  • డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్ పై మూడు రోజుల కార్నివాల్
  • అధికారులలో డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష
  • సమావేశానికి హాజరైన మంత్రులు ఉత్తమ్ , పొంగులేటి, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు

 

హైదరాబాద్, మహా : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఏడాది కాలంలో చేపట్టిన పధకాల అమలు, కార్యక్రమాలను రాష్ట్రంలోని ప్రతి గడపకు చెర వేసేలా విస్తృత స్థాయిలో కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం సందర్బంగా ప్రజా విజయోత్సవాలు ఇప్పటికే ప్రారంభించామన్నారు. హైదరాబాద్ లోని ఎల్.బీ స్టేడియంలో పాఠశాల విద్యార్థుల దినోత్సవం, వరంగల్ లో మహిళా దినోత్సవం కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని, అదే విధంగా ఈనెల 30 వ తేదీన మహబూబ్ నగర్ లో రైతు దినోత్సవం నిర్వహిస్తున్నట్టు వివరించారు. అలాగే డిసెంబర్ 7, 8, 9 తేదీలలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మార్గాలలో కన్నుల పండగగా కార్నివాల్, లేజర్ షో, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మూడు రోజుల ఉత్సవాలలో మహిళలు, పిల్లలు, పౌరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే, ప్రతి జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ విజయవంతంగా జరుగుతున్నాయని, గ్రామ స్థాయి నుండి, మండలాలు, జిల్లా స్థాయి వరకు ఈ ప్రజా విజయోత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. ఏడాది కాలంలో అమలు చేసిన పధకాలు, కార్యక్రమాలపై అంతర్గతంగా ప్రతి శాఖ వేడుకలు నిర్వహించుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఏడాది కాలంలో చేపట్టిన విజయాలను ప్రతి వ్యక్తికి చేరవేసేలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ బడులలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించాలన్నారు.

 

నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న దాదాపు 70 లక్షల స్వయం సహాయక మహిళలకు సున్నా వడ్డీ పధకం, బ్యాంకు లింకేజీలు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ తదితర మహిళా సాధికారత పధకాల వివరాలన్నీ వారికి చేరవేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ విజయాలపై ప్రత్యేకంగా రూపొందించిన హోర్డింగులు, షార్ట్ ఫిలిం లు, తదితర ప్రచార అంశాలను సోషల్ మీడియా ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న దాదాపు 25 వేల ఆర్టీసీ బస్సుల పై ఈ హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా ప్రభుత్వ గ్యారెంటీలలో భాగంగా అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ కవరేజి పెంపు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర పథకాలపై పాఠశాల విద్యార్థులు వ్యాసరచన, వకృత్వ పోటీలను నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, ఈ ప్రజా విజయోత్సవాలు పురస్కరించుకొని రాష్ట్రంలో నర్సింగ్, పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం, 200 విధ్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభం, 9007 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందచేయడం, ఆరు ప్రధాన పాలసీలను ముఖ్యమంత్రిచే ప్రారంభించుకోవడం తదితర కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని వివరించారు.