Mahaa Daily Exclusive

  డిజిటల్ డెత్ ట్రాప్ లో యువత భవిష్యత్తు: ఆన్‌లైన్ గేమ్ ముసుగులో అండర్‌వరల్డ్ దందా!?

Share

డిజిటల్ డెత్ ట్రాప్ లో యువత భవిష్యత్తు: ఆన్‌లైన్ గేమ్ ముసుగులో అండర్‌వరల్డ్ దందా!?
ఆన్‌లైన్ గేమింగ్ ముసుగులో భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న అక్రమ బెట్టింగ్ యాప్‌లు ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల మీదుగా ఆపరేట్ అవుతున్న ఈ డిజిటల్ జూదం, కేవలం స్థానిక శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదు, ఇది దేశ ఆర్థిక భద్రతను దెబ్బతీసే ఒక వ్యవస్థీకృత నేరం.

డిజిటల్ బెట్టింగ్ యాప్‌ల ముప్పును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే పలు కీలక చర్యలు తీసుకున్నాయి. ఫిబ్రవరి 2023లో, కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం – 2000 లోని సెక్షన్ 69(ఎ) కింద దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన 138 బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను, అలాగే 94 లోన్ యాప్‌లను నిషేధించింది.

దుబాయ్, పాకిస్థాన్ కేంద్రంగా జరిగిన ‘మహాదేవ్ ఆన్‌లైన్ బుక్’ కుంభకోణం దీనికి అతిపెద్ద ఉదాహరణ. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడుల్లో భారీ ఎత్తున నగదు, ఆస్తులు పట్టుబడ్డాయి. ఈ యాప్ నిర్వాహకులు పాకిస్థాన్ లోని హవాలా నెట్‌వర్క్ ద్వారా డబ్బును మళ్లించడమే కాకుండా, దుబాయ్, పాకిస్థాన్ ల నుండి దాదాపు 60కి పైగా అక్రమ యాప్‌లను నడుపుతున్నట్లు ఈడీ విచారణలో తేలింది. వీరి కొత్త యాప్ ‘ఖేలో యార్’ కు అండర్ వరల్డ్ లింక్స్ ఉన్నట్లు కూడా దర్యాప్తు సంస్థలుకు తెలిసింది.

భారతదేశంలో నిషేధించబడి, చట్టవిరుద్ధంగా పరిగణించబడుతున్న మహాదేవ్ బుక్, పారిమ్యాచ్, 1ఎక్స్‌బెట్ వంటి బెట్టింగ్ యాప్‌లతో పాటు, పబ్-జీ, ఫ్రీ ఫైర్ వంటి చైనాతో సంబంధం ఉన్న వందలాది మొబైల్ గేమ్‌లను ఐటీ చట్టం కింద ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఈ యాప్‌లు రహస్యంగా వినియోగదారుల డేటాను విదేశాల్లోని సర్వర్‌లకు పంపుతున్నాయని, దీని వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని అధికారులు పేర్కొన్నారు.

భారత ప్రభుత్వ అధికారిక సమాచారం, ఈడీ లెక్కల ప్రకారం ఆన్‌లైన్ జూదం వల్ల సుమారు 45 కోట్ల మంది యువత, ప్రజలు తీవ్రంగా నష్టపోగా, ఏటా సుమారు 20 వేల కోట్ల రూపాయలను భారతీయులు కోల్పోతున్నారు. ‘మహాదేవ్ బెట్టింగ్ యాప్’ ద్వారా నెలకు ఏకంగా రూ. 450 కోట్ల అక్రమ సంపాదన జరగ్గా, దానికి సంబంధించి దాదాపు రూ. 3,800 కోట్ల ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. ఇలా ప్రజల కష్టార్జితం ఆవిరైపోతూ, యువత అప్పులపాలై మానసిక క్షోభకు, ఆత్మహత్యలకు గురవుతున్న గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ అక్రమాలపై పోలీసుల చర్యలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, బెట్టింగ్ యాప్‌ల బారిన పడి యువత ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణకు చెందిన ఓ మానవ హక్కుల న్యాయవాది జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మరోవైపు, ఈ విదేశీ బెట్టింగ్ యాప్‌లు యువతను ఆకర్షించడానికి సినిమా తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను వాడుకుంటున్నాయి. ఈ యాప్‌లను ప్రమోట్ చేశారనే ఆరోపణలపై తెలంగాణలో ఈడీ దాదాపు 29 మంది సినీ ప్రముఖులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో సినీ పరిశ్రమలో తీవ్ర స్థాయి అవగాహన మొదలైంది. తాము ప్రచారం చేసే బ్రాండ్ల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాలను విశ్లేషించుకుంటూ, నైతిక బాధ్యతతో ఇటువంటి అక్రమ సంస్థల ప్రమోషన్లకు వారు దూరంగా ఉంటున్నారు.

ఈ సమస్యలో దర్యాప్తు సంస్థల ముందు అనేక సాంకేతిక, చట్టపరమైన సవాళ్లు ఉన్నాయి. చైనాలో డిజైన్ చేయబడి, పాకిస్థాన్ సర్వర్ల ద్వారా నడుస్తూ, బంగ్లాదేశ్ ఖాతాల మీదుగా డబ్బులు మళ్లించే యాప్‌లను పట్టుకోవడం స్థానిక పోలీసుల పరిధికి మించిన విషయం. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసిన మరుక్షణం, వేరొక పేరుతో అవే సేవలను ప్రారంభిస్తున్నారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం “ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025” ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఫాంటసీ స్పోర్ట్స్, రమ్మీ, పోకర్ వంటి “నైపుణ్యంతో ఆడే ఆటలు” అని గతంలో సమర్థించుకున్న వాటితో సహా – నగదు పందెం ఉన్న ఆన్‌లైన్ గేమ్‌లన్నింటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

విదేశీ బెట్టింగ్ యాప్‌లనేవి మన దేశం ముందున్న ఒక ఆధునిక సవాలు. అయితే, ప్రభుత్వ సంస్థల కఠిన చర్యలు, బాధ్యతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీలు, ప్రశ్నించే సామాజిక కార్యకర్తలు, నిరంతరం శ్రమిస్తున్న సైబర్ పోలీసులు.. వీరందరి సమష్టి కృషితో భారతదేశం ఈ డిజిటల్ ముప్పును త్వరలోనే శాశ్వతంగా అధిగమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చట్టపరమైన చర్యలతో పాటు, ప్రజల్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి అవగాహన కల్పిస్తూ “డిజిటల్ అక్షరాస్యత” పెంచడం అత్యంత ఆవశ్యకం.