యాక్సిడెంట్ అని నమ్మించు.. వాడ్ని లేపేయ్!’
* భర్త హత్యకు భార్య కిరాతక స్కెచ్.
* వాట్సాప్ చాటింగ్‌తో బట్టబయలైన క్రైమ్ థ్రిల్లర్!
ఖమ్మం, మహా.
పైకి చూస్తే పచ్చని కాపురం.. ఇద్దరు పిల్లలు.. కానీ, ఆ ఇల్లాలి మనసులో మాత్రం నేరపూరిత ఆలోచనలు గూడుకట్టుకున్నాయి. కట్టుకున్న వాడిని కడతేర్చి, ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరగాలని వేసిన మాస్టర్ ప్లాన్.. సోషల్ మీడియా చాటింగ్స్ రూపంలో అడ్డంగా దొరికిపోయింది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో సినిమాను మించిన ఈ రియల్ లైఫ్ ‘క్రైమ్ థ్రిల్లర్’ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
*వివాహేతర సంబంధమే ప్రాణసంకటం*
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడుకు చెందిన గాదే రాజేశ్వరరావుకు, సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురానికి చెందిన భవానితో 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తూ రాజేశ్వరరావు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, అదే ప్రాంతంలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్న సైదులు అనే యువకుడితో భవానికి ఏర్పడిన వివాహేతర సంబంధం ఈ ఘోరానికి దారితీసింది. గత నెల 27న మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లిన రాజేశ్వరరావుకు.. తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని కళ్లారా చూసి ఊహించని షాక్ తగిలింది.
* కథను మలుపు తిప్పిన మొబైల్ ఫోన్*
ఈ వ్యవహారంపై మరుసటి రోజు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినప్పటికీ లాభం లేకపోయింది. పక్క గ్రామంలో ఉన్న తన అన్నను తీసుకురావడానికి వెళ్తున్న రాజేశ్వరరావును ప్రియుడు సైదులు వెంబడించడంతో కథ కీలక మలుపు తిరిగింది. ప్రాణభయంతో తప్పించుకుని నేరుగా ఇంటికి చేరుకున్న బాధితుడు.. భార్య మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా ఆమె సాగించిన కిరాతక కుట్ర, భయానక వాట్సాప్ చాటింగ్స్ వెలుగులోకి వచ్చాయి.
*గుండెలు జలదరించే సంభాషణలు*
ప్రియుడు సైదులుతో భవాని చేసిన చాటింగ్స్ చూస్తే వారి క్రూరత్వం స్పష్టంగా అర్థమవుతుంది. రాజేశ్వరరావు తనను డబ్బులు అడుగుతున్నాడని, లేకుంటే తండ్రికి ఫోన్ చేస్తానని భయపెడుతున్నాడని భవాని ఆందోళనగా మెసేజ్ చేయగా.. ఏమీ భయపడవద్దని, సాయంత్రానికల్లా డబ్బులు ఇస్తానని చెప్పమని సైదులు ధైర్యం చెప్పినట్లు చాటింగ్‌లో ఉంది. కట్టుకున్న భర్తను మానసికంగా బ్లాక్ మెయిల్ చేయడం కూడా వారి ప్లాన్‌లో ఒక భాగంగానే స్పష్టమవుతోంది.
అంతేకాకుండా, భర్తను చంపొద్దు, దానికి బదులు బయట ఎక్కడైనా యాక్సిడెంట్ చేయవా అంటూ భవాని నేరుగా అడగడం వారి నేర బుద్ధికి నిదర్శనం. వాట్సాప్ కాల్ డేటా బయటకు రాకుండా జాగ్రత్త పడుతూనే.. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ‘ప్రమాదం’గా నమ్మించాలనేది వారి వ్యూహంగా తెలుస్తోంది. వాడిని అలా అయినా చంపాలి, లేకుంటే నన్ను చంపుతాడు అని భవాని భయపడుతుండగా.. తన తలకి రక్తం పడుతుందని, ఆ పని తానే చేస్తానని సైదులు కోపంతో బదులివ్వడం వారి కుట్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.
*పోలీసుల విచారణ ముమ్మరం*
ఈ సంచలన చాటింగ్‌ల స్క్రీన్షాట్లను, నిందితుల ఫోటోలను కీలక ఆధారాలుగా సేకరించిన రాజేశ్వరరావు, తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు. తొలుత ఈ నెల 1న డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి కేసును ఖమ్మం రూరల్ పీఎస్‌కు బదిలీ చేశారు. అయితే అధికారులు వెంటనే చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ గురువారం మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఖమ్మం రూరల్ సీఐ.. కేసు నమోదు చేసి వాట్సాప్ చాటింగ్స్, కాల్ డేటా తదితర సాంకేతిక ఆధారాలను లోతుగా పరిశీలిస్తున్నామని, నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.






