తెలంగాణకు డీఏపీ ఎరువులు పెంచాలని విజ్ఞప్తి.
* కేంద్ర మంత్రి నడ్డాను కలిసిన కాంగ్రెస్ ఎంపీలు.
* రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు కోరారు.
ఢిల్లీ, మహా.
తెలంగాణలో వ్యవసాయ సీజన్ ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు తగినంత పరిమాణంలో డీఏపీ (డై-అమ్మోనియం ఫాస్ఫేట్) ఎరువులు అందుబాటులో ఉండేలా వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్ భవనంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్ర రైతాంగ సమస్యలను వివరించారు.
కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, సురేష్ నేతృత్వంలోని బృందం కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించింది. ప్రస్తుతం తెలంగాణలో ఖరీఫ్ సాగు పనులు జోరుగా సాగుతున్నాయని, ఈ సమయంలో డీఏపీ ఎరువులకు భారీ డిమాండ్ ఉంటుందని పేర్కొంది. రైతులు ఇబ్బందులు పడకుండా కేంద్రం వెంటనే రాష్ట్రానికి అవసరమైన కోటా మేర ఎరువులను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలందరూ సంతకాలు చేసిన ప్రతిపాదన పత్రాన్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అందజేశారు. రాష్ట్రంలో డీఏపీ కొరత ఏర్పడితే సాగు పనులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా సానుకూలంగా స్పందించినట్లు ఎంపీలు తెలిపారు. తెలంగాణ రైతాంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డీఏపీ ఎరువుల సరఫరా అంశాన్ని ప్రాధాన్యతతో పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
వ్యవసాయానికి అత్యంత కీలకమైన ఈ దశలో ఎరువుల కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఎంపీలు కోరారు. రాష్ట్ర రైతులకు అవసరమైన డీఏపీ ఎరువులు సకాలంలో అందేలా కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.







