Mahaa Daily Exclusive

  కావేరీ జలాలపై తమిళనాడు అసెంబ్లీలో దుమారం…

Share

కావేరీ జలాలపై తమిళనాడు అసెంబ్లీలో దుమారం.
*’విజయ్, ఉదయనిధి మధ్య వాడివేడి వాగ్వాదం.
*’మేకెదాటు ప్రాజెక్టుపై ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు.

చెన్నై, మహా.

కావేరీ జలాల వివాదం శుక్రవారం తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. మేకెదాటు ఆనకట్ట నిర్మాణం, కావేరీ జలాల పంపిణీ, తమిళనాడు ప్రయోజనాల పరిరక్షణ అంశాలపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ మధ్య వాడివేడి వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన ప్రతిపక్షం, కర్ణాటక చేపడుతున్న మేకెదాటు ప్రాజెక్టును అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించగా, ముఖ్యమంత్రి విజయ్ ఆ విమర్శలను తీవ్రంగా ఖండించారు.

కావేరీ జలాల సమస్యపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను సభలో వివరించాలని ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు ఆనకట్ట నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలని కోరారు. తమిళ రైతుల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కృషి చేయడం లేదని ఆయన ఆరోపించారు.

ఈ ఆరోపణలకు సమాధానంగా ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, మేకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభ ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని గుర్తు చేశారు. అంతేకాకుండా, ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాను లేఖ కూడా రాశానని వెల్లడించారు. తమిళనాడు రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, రాష్ట్ర హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

అనంతరం రాజకీయ కోణాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి విజయ్, 1969లో మేకెదాటు ప్రాజెక్టుకు సంబంధించి తొలి అనుమతులు అప్పటి డీఎంకే ప్రభుత్వ హయాంలోనే లభించాయని పేర్కొంటూ ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగారు. ప్రస్తుతం ఈ అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న డీఎంకే గత చరిత్రను కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్, మేకెదాటు ప్రాజెక్టు విషయంలో కర్ణాటకలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నాయని గుర్తుచేశారు. అదే తరహాలో తమిళనాడులో కూడా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

ముఖ్యమంత్రి విజయ్ బెంగళూరు పర్యటన అంశాన్ని కూడా ఉదయనిధి స్టాలిన్ ప్రస్తావించారు. తొలుత ముఖ్యమంత్రి బెంగళూరు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతారని సమాచారం బయటకు వచ్చిందని, అనంతరం వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఆ వార్తలను ఖండించిందని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అయితే, ముఖ్యమంత్రి బెంగళూరు పర్యటనకు సంబంధించి ప్రతిపాదన ఉన్న మాట వాస్తవమేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కావేరీ జలాల పంపిణీ వివాదం నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, నిరసనలను దృష్టిలో ఉంచుకుని పర్యటనను ప్రస్తుతానికి వాయిదా వేయాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోరినట్లు సమాచారం. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం మరోసారి రాజకీయంగా వేడెక్కగా, మేకెదాటు ఆనకట్ట అంశం దక్షిణాది రాజకీయాల్లో మరోసారి కేంద్రబిందువుగా మారింది.