సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణకు అగ్రస్థానం.
* దేశంలో నంబర్-1గా నిలిచిన టీజీసీఎస్బీ.
* సైబర్ సెక్యూరిటీ బ్యూరో బృందాన్ని అభినందించిన డీజీపీ.
హైదరాబాద్, మహా.
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రగతి’ సమీక్షలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య తెలంగాణ తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) డైరెక్టర్ శిఖా గోయెల్‌తో పాటు నగర పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, టీజీసీఎస్బీ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, బాధితులకు సహాయం, అంతర్రాష్ట్ర సమన్వయం, సామర్థ్యాభివృద్ధి, ప్రజల్లో అవగాహన వంటి తొమ్మిది కీలక పనితీరు ప్రమాణాల ఆధారంగా జరిగిన మూల్యాంకనంలో తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందని డీజీపీ వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ సైబర్ నేరాల నియంత్రణలో రాష్ట్ర పోలీసులు విశేష ఫలితాలు సాధించారని చెప్పారు.
రాష్ట్ర సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఎస్4సీ) ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని ఆయన తెలిపారు. రూ.5 లక్షలకు పైబడిన సైబర్ మోసాల కేసుల్లో ఇప్పటికే 49 ఈ-జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వేగంగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
సైబర్ మోసాల బాధితుల ఫిర్యాదుల పరిష్కారంలో తెలంగాణ 88 శాతం విజయశాతం నమోదు చేయగా, మోసపోయిన నగదును బాధితులకు తిరిగి అందించడంలో 81 శాతం పనితీరు కనబరిచిందని డీజీపీ వివరించారు. అక్రమ ఆన్లైన్ కంటెంట్ తొలగింపుకు ఉపయోగించే ‘సహయోగ్’ పోర్టల్ వినియోగంలో కూడా రాష్ట్రం 88 శాతం పనితీరుతో ముందంజలో నిలిచిందన్నారు.
‘సమన్వయ్’ కార్యక్రమం కింద 97 శాతం సీఐఏఆర్ అభ్యర్థనలు, 79 శాతం అంతర్రాష్ట్ర అభ్యర్థనలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే 5,500 మంది సైబర్ నేరస్థుల ప్రొఫైల్‌లను అప్లోడ్ చేసి, 15 వేల అంతర్రాష్ట్ర నేర సంబంధాలను గుర్తించినట్లు వెల్లడించారు. సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ‘సైట్రైన్’ వేదిక ద్వారా 524 మంది పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించినట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా గుర్తించిన 15 ప్రధాన సైబర్ నేరాల హాట్‌స్పాట్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేకపోవడం రాష్ట్ర పనితీరుకు నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు. సైబర్ భద్రతపై నిర్వహించిన విస్తృత అవగాహన కార్యక్రమాల ద్వారా 8.5 లక్షల మందికి పైగా ప్రజలకు చైతన్యం కల్పించామని, డిజిటల్ అరెస్ట్ మోసాలపై మరో రెండు లక్షల మందిని ప్రత్యేకంగా అవగాహన కల్పించినట్లు తెలిపారు.
ఈ ఘనత తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారుల నిబద్ధత, సమన్వయం, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనమని డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా సాంకేతిక ఆధారిత పోలీసింగ్, వినూత్న చర్యలు, ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాల ద్వారా సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.






