Mahaa Daily Exclusive

  మక్కా రక్షణ ఒప్పందంతో కొత్త వ్యూహాత్మక కూటమి….

Share

మక్కా రక్షణ ఒప్పందంతో కొత్త వ్యూహాత్మక కూటమి.
*పాక్, సౌదీ, టర్కీ మధ్య త్రైపాక్షిక రక్షణ ఒప్పందం.
* ఒక దేశంపై దాడి అంటే మూడింటిపై దాడిగానే పరిగణింపు.

మక్కా, మహా.

పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు చారిత్రక త్రైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’ పేరుతో కుదిరిన ఈ ఒప్పందంపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా, అది మూడు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించి ఉమ్మడిగా స్పందించనున్నట్లు ప్రకటించారు.

ఈ ఒప్పందంతో మూడు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది. ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడం, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, సైనిక సాంకేతిక పరిజ్ఞానం, నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం, రక్షణ పరిశ్రమల్లో సహకారాన్ని విస్తరించడం వంటి అంశాలకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా సవాళ్ల నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ రక్షణ కూటమి ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించలేదని, ప్రాంతీయ భద్రత, ఉమ్మడి రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధాన ఉద్దేశమని మూడు దేశాల నాయకత్వం స్పష్టం చేసింది.

మూడు దేశాల్లో పాకిస్థాన్‌కు మాత్రమే అణ్వాయుధ సామర్థ్యం ఉండగా, టర్కీ నాటోలో రెండో అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉంది. సౌదీ అరేబియా ఆర్థిక, వ్యూహాత్మక సామర్థ్యంతో ఈ కూటమికి మరింత బలం చేకూరనుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందం భవిష్యత్తులో ఇతర మిత్రదేశాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.