ఈఎంఐలు బకాయిలైతే ఫోన్‌కు డిజిటల్ తాళం.
* 2027 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలు.
* రుణ చెల్లింపుల్లో నిర్లక్ష్యానికి కఠిన చర్యలు.
ఢిల్లీ, మహా.
స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఈఎంఐలపై కొనుగోలు చేసే వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక హెచ్చరిక జారీ చేసింది. రుణ వాయిదాలను నిర్లక్ష్యంగా చెల్లించకుండా బకాయిలు పెంచుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, ఈఎంఐలను వరుసగా చెల్లించకపోతే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రిమోట్ డివైస్ లాకింగ్ సదుపాయాన్ని వినియోగించి పరికరాలను పరిమితంగా లేదా పూర్తిగా లాక్ చేసే అవకాశం ఉంటుంది.
కొత్త విధానం ప్రకారం, ఈఎంఐ చెల్లింపులో 30 రోజులకుపైగా జాప్యం జరిగితే ముందుగా పాక్షిక లాక్ అమలు చేయనున్నారు. ఈ దశలో మొబైల్లోని కొన్ని యాప్‌లు, సేవలు, ఫీచర్లు పనిచేయకుండా నిలిపివేస్తారు. అనంతరం 60 రోజులకుపైగా బకాయిలు కొనసాగితే సంబంధిత పరికరాన్ని పూర్తిస్థాయిలో లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలు కేవలం స్మార్ట్ఫోన్లకే కాకుండా రుణంపై కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లకు కూడా వర్తించనున్నాయి.
అయితే అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు కొన్ని మినహాయింపులు కల్పించారు. పరికరం పూర్తిగా లాక్ అయినప్పటికీ అత్యవసర కాల్స్, ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు వంటి ప్రాథమిక కమ్యూనికేషన్ సేవలు కొనసాగుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది.
వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలగదని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. రిమోట్ డివైస్ లాకింగ్ ప్రక్రియలో బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలకు వినియోగదారుల ఫోన్లోని ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్‌లు, బ్యాంకింగ్ యాప్‌లు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని చూడటానికి, కాపీ చేసుకోవడానికి లేదా వినియోగించడానికి ఎలాంటి అనుమతి ఉండదని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తిగా పరికరం వినియోగాన్ని పరిమితం చేయడానికే పరిమితమవుతుందని వివరించింది.
కొత్త నిబంధనల ప్రకారం రుణం మంజూరు చేసే సమయంలోనే డిఫాల్ట్ పరిస్థితుల్లో రిమోట్ లాకింగ్ అమలు చేసే అవకాశం ఉందని రుణగ్రహీతకు స్పష్టంగా తెలియజేయడం, అతని అంగీకారం తీసుకోవడం రుణదాతలకు తప్పనిసరి కానుంది. ఈ విధానం ద్వారా రుణ చెల్లింపుల్లో క్రమశిక్షణ పెరగడంతో పాటు, డిఫాల్ట్‌లను తగ్గించడమే లక్ష్యమని ఆర్బీఐ పేర్కొంది.
దేశంలో ఇటీవలి కాలంలో ‘బై నౌ–పే లేటర్’ విధానంలో ఖరీదైన గ్యాడ్జెట్ల కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలకు ప్రాధాన్యం ఏర్పడింది. సమయానికి ఈఎంఐలు చెల్లించే అలవాటు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, బకాయిలు కొనసాగితే మాత్రం రుణ నిబంధనల ప్రకారం పరికరాల వినియోగంపై పరిమితులు విధించే అవకాశం ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు సూచిస్తున్నాయి.






