Mahaa Daily Exclusive

  పోలవరం నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన…

Share

పోలవరం నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన.

* 2027 జూన్ నాటికి తొలి దశ పూర్తి లక్ష్యం.

* నిధులు ఫేజ్-1కే.. పనులు ఎఫ్‌ఆర్‌ఎల్ వరకు.

 

ఢిల్లీ, మహా.

 

ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక వివరాలను వెల్లడించింది. ప్రాజెక్టు తొలి దశ (ఫేజ్-1) కింద కేంద్రం అందించే ఆర్థిక సహాయం 41.15 మీటర్ల నీటి నిల్వ మట్టం వరకు మాత్రమే వర్తించినప్పటికీ, ప్రధాన ఆనకట్టకు సంబంధించిన సివిల్ నిర్మాణ పనులు పూర్తి స్థాయి జలాశయ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) అయిన 45.72 మీటర్ల ఎత్తు వరకు చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.

 

లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా అవసరమైన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.

 

ప్రధాన డ్యామ్‌లోని గ్యాప్-1, గ్యాప్-2 నిర్మాణ పనులతో పాటు భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం (ఆర్‌అండ్‌ఆర్) కార్యక్రమాలను కూడా 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణం నిర్ణీత గడువులో పూర్తయ్యేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

 

2023 ధరల ప్రకారం పోలవరం ఫేజ్-1 (41.15 మీటర్ల ఎలివేషన్) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.30,436.95 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ఇందులో ఇంకా రూ.12,157.53 కోట్ల గ్రాంట్ విడుదల చేయాల్సి ఉందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,512.40 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,810.22 కోట్లను ఇప్పటికే విడుదల చేసినట్లు లోక్‌సభకు వివరించారు.

 

కేంద్ర ప్రభుత్వం అందించే గ్రాంట్ ఫేజ్-1 పరిధిలోని భూసేకరణ, పునరావాసం, కుడి, ఎడమ ప్రధాన కాలువల నిర్మాణానికి మాత్రమే వర్తిస్తుందని, అయితే ప్రధాన ఆనకట్టకు సంబంధించిన సివిల్ నిర్మాణం 45.72 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ స్థాయి వరకు చేపట్టడం కూడా అదే ప్రణాళికలో భాగమని స్పష్టం చేశారు.

 

పోలవరం హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణ వ్యయాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రాజెక్టు నిధుల వినియోగానికి సంబంధించి అవసరమైన సాంకేతిక నివేదికలు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సకాలంలో సమర్పిస్తోందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందని కేంద్రం ప్రశంసించింది.