60 కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం.
* ఆకస్మిక తనిఖీల్లో హెచ్-ఫాస్ట్ అధికారుల చర్యలు.
* యజమానిపై కేసు నమోదు చేసి చలాన్ విధింపు.
హైదరాబాద్, మహా.
కాచిగూడ కమేళాలో శుక్రవారం హెచ్-ఫాస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 60 కిలోల కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన మాంసాన్ని అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఈ దాడులు చేపట్టారు.
టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ మహేష్, కానిస్టేబుల్ వినయ్‌తో కలిసి అధికారులు కమేళాకు చేరుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన 60 కిలోల కుళ్లిన మాంసాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ఎవరూ వినియోగించకుండా ఉండేందుకు దానిపై ఫినాయిల్ చల్లి నిర్వీర్యం చేశారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా కుళ్లిన మాంసాన్ని నిల్వ ఉంచిన యజమాని అఖిల్‌పై కేసు నమోదు చేసి చలాన్ విధించినట్లు అధికారులు తెలిపారు.
ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాలను విక్రయించే వారిపై భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.







