Mahaa Daily Exclusive

  జంతర్‌మంతర్ నిరసనలపై హైకోర్టు కీలక ప్రశ్నలు…..

Share

జంతర్‌మంతర్ నిరసనలపై హైకోర్టు కీలక ప్రశ్నలు.
* నగరాన్ని బందీ చేయొద్దన్న జస్టిస్ అమిత్ మహాజన్.
* నిరసన అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశం.

ఢిల్లీ, మహా.

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలకు ప్రధాన వేదికగా కొనసాగుతున్న జంతర్‌మంతర్‌ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. నగరం నడిబొడ్డున జరిగే ఆందోళనల వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మొత్తం నగరాన్ని బందీ చేసే పరిస్థితి తలెత్తకూడదని జస్టిస్ అమిత్ మహాజన్ వ్యాఖ్యానించారు. జంతర్‌మంతర్‌ను నిరసనల వేదికగా కొనసాగించాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమే అయినప్పటికీ, తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదని స్పష్టం చేశారు.

ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలోనే జంతర్‌మంతర్ వద్ద శాంతియుత నిరసనకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని, తిరస్కరించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది సంజయ్ ఘోష్ కోర్టుకు తెలిపారు. నిరసనలో గరిష్ఠంగా 75 మంది మాత్రమే పాల్గొంటారని పేర్కొన్నప్పటికీ, దరఖాస్తుపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని వాదించారు.

ఈ సందర్భంగా జస్టిస్ అమిత్ మహాజన్ స్పందిస్తూ, జంతర్‌మంతర్‌ను ఎందుకు మూసివేయకూడదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హక్కులను తాను వ్యతిరేకించడం లేదని, అయితే నగర ప్రజల సాధారణ జీవనానికి తీవ్ర అంతరాయం కలిగించే పరిస్థితులు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రయోజనాలు, ప్రజాస్వామ్య హక్కుల మధ్య సమతుల్యత అవసరమని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ మాట్లాడుతూ, జంతర్‌మంతర్‌ను నిరసనల కోసం ప్రత్యేక ప్రదేశంగా కొనసాగించాలా లేదా అనే అంశాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జస్టిస్ మహాజన్ మరోసారి స్పందిస్తూ, వ్యక్తిగతంగా అక్కడ నిరసనలు జరగకూడదని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.

అయితే ఢిల్లీలో శాంతియుత ప్రజాస్వామ్య నిరసనలకు అవకాశం ఉండదా అని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించగా, అది పోలీసులు పరిస్థితులను బట్టి నిర్ణయించాల్సిన అంశమని కోర్టు తెలిపింది. షాహీన్‌బాగ్ కేసులో సుప్రీంకోర్టు శాంతియుత నిరసన హక్కును గుర్తించిన విషయాన్ని న్యాయవాది గుర్తుచేయగా, ప్రజాస్వామ్య హక్కులు ఉండాలని, అయితే వాటి కారణంగా నగరం మొత్తం బందీ కావడం సమంజసం కాదని జస్టిస్ మహాజన్ వ్యాఖ్యానించారు.

విచారణ ముగింపులో ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సమర్పించిన నిరసన అనుమతి దరఖాస్తుపై ఆగస్టు 8లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.