Mahaa Daily Exclusive

  జీఎస్టీ ఆదాయానికి ఏఐతో కొత్త దిశ…

Share

జీఎస్టీ ఆదాయానికి ఏఐతో కొత్త దిశ.
• సాంకేతికతతో పన్నుల లీకేజీలకు అడ్డుకట్ట లక్ష్యం.
• రాబడి పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.

హైదరాబాద్, మహా.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయాన్ని పెంచడంతో పాటు పన్నుల లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సులభతర వాణిజ్య వాతావరణాన్ని కల్పించాలన్నారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్, రాష్ట్ర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన సంస్కరణలు, ఆదాయ వనరుల విస్తరణ, జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు.

జీఎస్టీ అధికారులకు ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పన్నుల అంచనా, పర్యవేక్షణ, విశ్లేషణ మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వల్ల వ్యాపారాలకు ఆటంకాలు కలగకుండా, అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు రాబడి పెరిగేలా వ్యవస్థను రూపొందించాలని అరవింద్ సుబ్రమణియన్ సూచించినట్లు సమావేశంలో చర్చించారు.

పన్నుల లీకేజీల నివారణలో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పన్ను ఎగవేతను అరికట్టేందుకు మున్సిపల్, రెరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల సమాచారాన్ని ఏఐ ఆధారిత సమగ్ర వేదికపై అనుసంధానం చేయాలని ఆదేశించారు.

భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే అవసరమయ్యే నిర్మాణ సామగ్రి వివరాలు, వాటికి సంబంధించిన పన్నుల అంచనాలను నమోదు చేసే విధానాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. ఆ సమాచారంతో పాటు మీసేవ, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి ప్రభుత్వ సేవలకు సంబంధించిన డేటాను కూడా సమీకరిస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొని పన్నుల సంస్కరణలు, సాంకేతిక ఆధారిత పాలనపై చర్చించారు.