- పేదల భూములపై పడి కీచకుల్లా వ్యవహరిస్తున్న సర్కార్
- ‘ధరణి’ పోయినా ధోరణి మారలేదు
- ‘భూభారతి’ కాస్త పేదల పాలిట ‘భూహారతి’గా మారింది
- పేదలు, రైతుల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోం
- కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం
- ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను కాపాడాల్సింది పోయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ తరహాలో వ్యవహరిస్తూ లక్షల కోట్ల రూపాయల భూదందాకు తెరతీసిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వస్తే భూ సమస్యలన్నీ తీరి పారదర్శకమైన చట్టం వస్తుందని ప్రజలు ఆశిస్తే, గత కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో పేద రైతుల హక్కులను కాలరాసిందని ఈటల విమర్శించారు. ధరణి రాకముందు పహాణీలలో ఉన్న 13 కాలమ్స్ (ముఖ్యంగా కబ్జా, కాస్తు కాలమ్స్) తొలగించడం వల్ల 50-70 ఏళ్లుగా భూములను సాగుచేసుకుంటున్న దళితులు, గిరిజనులు, బీసీ పేద రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి, ఇప్పుడు ‘భూభారతి’ పేరుతో మరింత దారుణంగా పేద రైతాంగాన్ని అగాధంలోకి నెట్టిందని.. ‘ధరణి పోయినా ధోరణి మారలేదు, భూభారతి కాస్త పేదలకు భూహారతిగా మారింది’ అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి పది అడుగులు ముందుకేసి భూముల వేలం ద్వారా దాదాపు రూ.10 లక్షల కోట్లు సమకూర్చుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారని ఈటల మండిపడ్డారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని నగర విస్తరణ ప్రాంతాల్లో వేల ఎకరాల పేదల భూములను హైడ్రా, వందల మంది పోలీసుల పహారాతో రాత్రికి రాత్రే ఫెన్సింగ్‌లు, గోడలు కట్టి డీల్స్‌కు అప్పగిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు గ్రామాలపై పడి కీచకుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో బీజేపీ నేతలు టైగర్ నరేంద్ర, బద్దం బాల్‌రెడ్డి, బండారు దత్తాత్రేయలు పేదల కోసం పోరాడి అడ్డగుట్ట, వారాసిగూడ, వాజ్‌పేయి నగర్, దత్తాత్రేయ నగర్, దీన్‌దయాళ్ నగర్ లాంటి బస్తీలను ఏర్పాటు చేయించారని, నేడు కూడా పేదల భూముల పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని ఈటల స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ బ్రోకరింగ్ దందాను ఆపి, పేదల భూములను గుంజుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ భూ దోపిడీపై ప్రజా ఉద్యమాలు నిర్మించడంతో పాటు, కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా పోరాడతామని స్పష్టం చేశారు.








