Mahaa Daily Exclusive

  22ఎకు సంబంధించి 24గంట‌ల్లో 34 రిజిస్ట్రేష‌న్లు చేశాం..! మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

Share

  • 22ఎకు సంబంధించి 24గంట‌ల్లో 34 రిజిస్ట్రేష‌న్లు చేశాం
  • తప్పును ఒప్పుకొని సరిదిద్దుతున్నాం
  • ధరణి తో చేసిన తప్పులకు సమాధానం చెప్పే ధైర్యం హ‌రీష్‌రావుకు ఉందా?
  • ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
  • సామాన్య ప్రజల హక్కులు, ఆస్తులకు పూర్తి రక్షణ క‌ల్పించే బాధ్య‌త మాది
  • 15 రోజుల పాటు రోజువారీగా దరఖాస్తుల పరిశీలన
  • మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, మహా : ఇది పేదల ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో పేదల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాడికి అన్యాయం చేయద‌ని, పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా ఈ ప్రభుత్వం తీసుకోద‌ని, వారి హక్కులు, ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ, 22ఏ నిషేధిత జాబితా వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని మ‌రోమారు స్ప‌ష్టం చేస్తూ సమస్య పరిష్కార ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంద‌ని 24 గంట‌ల్లోనే మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 మొత్తం 34 రిజిస్ట్రేషన్లు జరిగాయ‌ని మంత్రి వివ‌రించారు. హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ నిషేధిత భూముల వివరాలను ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సరిదిద్దుతోందని తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా పొరపాటును పారదర్శకంగా అంగీకరించి . అదే సమయంలో జరిగిన తప్పును సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకున్నామ‌ని ప్రజలను ఇబ్బందుల్లో వదిలేసే ప్రభుత్వం త‌మ‌ది కాద‌ని స్పష్టం చేశారు.

వివిధ జీవోలు, మెమోల ద్వారా గత ప్రభుత్వాల కాలంలో క్రమబద్ధీకరించబడిన ప్రైవేట్ భూములు, హైకోర్టు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు పొందిన స్థలాలు ఆన్‌లైన్ అప్‌లోడింగ్‌లో సాంకేతిక లోపం కారణంగా 22ఏ జాబితాలోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించిందని, బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించామని తెలిపారు. 22ఏ సమస్యల త్వరిత పరిష్కారం కోసం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, రాబోయే 15 రోజుల పాటు ఈ కమిటీ రోజువారీగా దరఖాస్తులను పరిశీలించి జెన్యూన్ ప్రైవేట్ ఆస్తులన్నింటినీ తక్షణమే క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కావాలనే 22ఏలో భూములు పెట్టి, వాటిని తొలగించడానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి ఘాటుగా స్పందించారు. “విమర్శలు చేయడం చాలా సులువు.. కానీ బాధ్యత తీసుకోవడం అంత సులువు కాదు. 22ఏ విషయంలో పొరపాటు జరిగిందని మేము బహిరంగంగా అంగీకరించాం.. ఆ పొరపాటును సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకున్నాం. వారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ధరణి పేరుతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు, జరిగిన తప్పులకు ఏనాడైనా బాధ్యత తీసుకున్నారా? కనీసం క్షమాపణ చెప్పారా?” అని ప్రశ్నించారు.

తప్పు జరిగితే దాన్ని అధికారుల మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవడం త‌మ ప్రభుత్వ విధానం కాదని స్ప‌ష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే పొరపాటును అంగీకరించామ‌న్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న హరీశ్ రావుకు ఇప్పటికీ 30 శాతం కమిషన్లు ఎందుకు గుర్తుకొస్తున్నాయో ప్రజలకు తెలుసు. వాళ్లు ఏ పద్ధతిలో పాలన సాగించారో ప్రజలు మరిచిపోలేదు. ఇప్పుడు పేదల సమస్యను పరిష్కరిస్తున్న ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం చాలా సులభం. కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో కూడా సమాధానం చెప్పాల‌న్నారు. కాళేశ్వరం విషయంలో జరిగిన పరిణామాలకు హరీశ్ రావు ఏనాడైనా బాధ్యత తీసుకున్నారా? ఇప్పుడు నేను మాత్రం నా శాఖలో పొరపాటు జరిగిందని చెప్పి, దానికి పరిష్కారం చూపేందుకు బాధ్యత తీసుకుంటున్నాను. ఇదే తేడా అని మంత్రి స్పష్టం చేశారు.

ఆరోపణలకు ఆధారాలు చూపాలి

బిజేఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ తాటాకు చప్పుళ్లకు నేను భయపడను. నాపై ఏదైనా ఆరోపణ చేస్తే ఆధారాలతో మాట్లాడాలి. ఆధారం ఉంటే ప్రజల ముందు పెట్టాలి. ఫీనిక్స్, రాఘవ తదితర సంస్థలతో వ్యాపార రంగంలో లావాదేవీలు జరగడం సహజం. వాటిని పట్టుకుని రాజకీయ ఆరోపణలు చేయడం సరికాద‌న్నారు. నేను రెండు దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఉన్నాను. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాను. ఒక్కరోజులో వేల కోట్లకు ఎదిగిన వ్యక్తిని కాదు. నా వ్యాపార ప్రస్థానం, నా నేపథ్యం గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆరోపణలు చేసేవారు ముందుగా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాల‌ని మంత్రి హితవు పలికారు

Latest