Mahaa Daily Exclusive

  గ్రామాలకు ప్రగతి బాటలు వేస్తాం.. అభివృద్ధి చేస్తాం.. ఎమ్మెల్యే రంగారెడ్డి..!

Share

హైదరాబాద్‌కు పక్కనే ఉన్నా ఇన్నాళ్లు అభివృద్ధికి నోచుకోని ఇబ్రహీంపట్నం…
వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా అభివృద్ధిలో ముందున్న ఇతర ప్రాంతాలు…
ఇబ్రహీంపట్నం రూపురేఖలు మార్చేందుకు కంకణం కట్టుకున్నా…
మూడేళ్లలోపే వందలకోట్లు తెచ్చి ప్రగతికి బాటలు వేస్తున్నా…
ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి…
యాచారం మండలంలో రూ.3.60కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం…
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో రోజంతా పల్లెల్లో పర్యటించిన మల్‌రెడ్డి..

ఇబ్రహీంపట్నం ఆగస్టు 18 మహా:
నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రూపురేఖలు మార్చేందుకు కంకణం కట్టుకున్నానని… ఇందులో భాగంగానే రెండున్నరేళ్లలోనే రూ.700కోట్లకు పైగా నిధులు మౌలికసదుపాయాల కల్పనకు తీసుకువచ్చినట్లు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి ఉద్ఘాటించారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ఇన్నాళ్లు అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉండిపోయిందన్నారు. వందలకిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్, తాండూర్‌లాంటి ప్రాంతాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాయన్నారు. 40వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఈ ప్రగతి యజ్ఞం చేపట్టినట్లు మల్‌రెడ్డి వెల్లడించారు.

కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం… యాచారం మండలంలో రూ.3.60కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మల్‌రెడ్డి రంగారెడ్డి…. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు గ్రామాల్లో పర్యటించారు. తొలుత మంతన్‌గౌరెల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే… గ్రామంలో రూ.20లక్షలతో భూగర్భడ్రైనేజీ, రూ.30లక్షల వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన… లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. సొంతింటి గృహ స్వప్నం నెరవేర్చిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, కేశీతండాకు వెళ్లిన మల్‌రెడ్డి… రూ.5లక్షలతో భూగర్భ డ్రైనేజీ, రూ.5లక్షలతో సీసీ రోడ్డు, రూ.20లక్షలతో గ్రామపంచాయతీ భవనం పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి, నల్లవెల్లిలో పర్యటిస్తూ… రూ.20లక్షలతో నిర్మించిన భూగర్భడ్రైనేజీ పనులు ప్రారంభించిన మల్‌రెడ్డి… ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. నల్లవెల్లితండాలో రూ.20లక్షలతో భూగర్భడ్రైనేజీ, మరో రూ.20లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. తమ్మలోనిగూడెంలో రూ.20లక్షలతో సీసీ రోడ్డుకు, మరో రూ.20లక్షలతో భూగర్భడ్రైనేజీ, సీసీరోడ్డుకు శంకుస్థాపన చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి… గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా మహిళలు, వృద్ధులతో కాసేపు ముచ్చటిస్తూ… పెన్షన్లు, ఉచిత ప్రయాణం, కరెంటులాంటి పథకాల ప్రయోజనాలను ఆరా తీశారు. చివరగా… చౌదర్‌పల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే… రూ.40లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు. అనంతరం, రూ.75లక్షలతో వివిధ మార్గాల్లో సీసీ రోడ్లు, రూ.25లక్షలతో భూగర్భడ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

గ్రామాలకు ప్రగతి బాటలు వేస్తేనే…
నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతోందని, ఇందులో భాగంగా రాజకీయాలకతీతంగా రాజీలేకుండా నిధులు మంజూరు చేస్తున్నట్లు మల్‌రెడ్డి రంగారెడ్డి చెప్పారు. ప్రజాప్రతినిధులందరూ కలిసివచ్చి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఆదర్శంగా తీర్చిదిద్దటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు కార్యకర్తలు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest