Mahaa Daily Exclusive

  కొత్త క్రిమినల్‌ చట్టాల అమలులో సమన్వయమే కీలకం..! సత్వర న్యాయానికి బలమైన వ్యవస్థ అవసరం..

Share

• డిజిటల్‌ ఆధారాలతో దర్యాప్తు.
• సత్వర న్యాయానికి బలమైన వ్యవస్థ అవసరం.
• హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
హైదరాబాద్‌, మహా.

కొత్త క్రిమినల్‌ చట్టాల అమలులో పోలీసులు, న్యాయవ్యవస్థ, ప్రాసిక్యూషన్‌, ఫోరెన్సిక్‌, వైద్య, జైళ్ల శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. అన్ని విభాగాల మధ్య సమర్థవంతమైన సమాచార మార్పిడి, సమన్వయం ఉన్నప్పుడే బాధితులకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు. కొత్త నేర న్యాయ చట్టాల అమలును మరింత సమర్థవంతంగా, సాంకేతికత ఆధారంగా చేపట్టే అంశాలపై తెలంగాణ రాష్ట్ర న్యాయ అకాడమీ, తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక సమగ్ర సమన్వయ సదస్సు నిర్వహించారు.
సుమారు 1,200 మంది న్యాయ, పోలీసు, ప్రాసిక్యూషన్‌, జైళ్ల, ఫోరెన్సిక్‌, వైద్య శాఖలకు చెందిన అధికారులు ఈ సదస్సుకు ప్రత్యక్ష, దృశ్య మాధ్యమ విధానంలో హాజరయ్యారు. కొత్త నేర న్యాయ చట్టాల అమలులో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అధికారులు విస్తృతంగా చర్చించారు.
డిజిటల్‌ పరిజ్ఞానంపై పట్టు అవసరం
న్యాయమూర్తి మౌషుమీ భట్టాచార్య మాట్లాడుతూ కొత్త చట్టాల సమర్థవంతమైన అమలుకు డిజిటల్‌ పరిజ్ఞానం ఎంతో అవసరమని అన్నారు. డిజిటల్‌ వేదికల్లో సమాచార నమోదు సమయంలో తప్పులు, ఒకే సమాచారాన్ని పలుమార్లు నమోదు చేయడం వంటి సమస్యలు కేసుల పరిష్కారంలో జాప్యానికి కారణమవుతున్నాయని సూచించారు. సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించే ప్రతి విభాగం బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
డీజీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ కొత్త నేర న్యాయ చట్టాలు కేవలం పాత చట్టాల స్థానంలో వచ్చిన మార్పులు మాత్రమే కాదని, దర్యాప్తు విధానంలో సమూల మార్పులకు ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. శాస్త్రీయ దర్యాప్తు, డిజిటల్‌ ఆధారాలు, ఎలక్ట్రానిక్‌ రికార్డులు, నిర్ణీత కాలపరిమితిలో ప్రక్రియలను పూర్తి చేయడం వంటి అంశాలకు కొత్త చట్టాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని వివరించారు.
నేర దర్యాప్తు నుంచి న్యాయ ప్రక్రియ వరకు డిజిటల్‌ బాట
సదస్సులో సాక్ష్య, ఎలక్ట్రానిక్‌ ప్రథమ సమాచార నివేదిక, డిజిటల్‌ ఆధారాలు, డిజిటల్‌ కేసుల నిర్వహణ, సమీకృత నేర న్యాయ వ్యవస్థ, ఎలక్ట్రానిక్‌ సమన్లు తదితర అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. ప్రథమ సమాచార నివేదిక నమోదు నుంచి నేరారోపణ పత్రం దాఖలు వరకు ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టే ప్రక్రియలను అధికారులు వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టుల్లో సాక్ష్యాల నమోదు, ఫోరెన్సిక్‌–వైద్య విభాగాల మధ్య సమాచార అనుసంధానం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు. నేర దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు, ఫోరెన్సిక్‌, వైద్య విభాగాల మధ్య సమాచార మార్పిడి వేగవంతం కావాలని డీజీపీ సూచించారు.
కొత్త చట్టాల అమలులో ఏర్పడే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు నెలవారీ సమీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సదస్సులో ప్రతిపాదించారు. హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన వివిధ శాఖల మధ్య సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకొచ్చింది. దీంతో కొత్త నేర న్యాయ చట్టాల అమలులో వివిధ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం కానుంది.

Latest