Mahaa Daily Exclusive

  22ఏ భూముల సమస్యకు చెక్‌..! ఫిర్యాదుల పరిష్కారంపై పొంగులేటి ఫోకస్‌..!

Share

  • 22ఏ భూముల సమస్యకు చెక్‌.
  •  ఫిర్యాదుల పరిష్కారంపై పొంగులేటి ఫోకస్‌.
  •  దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు.
  •  అర్హులైన హక్కుదారులకు న్యాయం చేయాలి.

హైదరాబాద్‌, మహా .

తెలంగాణలో 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 22ఏ జాబితాలో తమ భూములు చేరడంపై వస్తున్న ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన నిజమైన హక్కుదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
22ఏ భూములకు సంబంధించిన సమస్యలపై ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌కు ఇప్పటివరకు సుమారు 400 ఫిర్యాదులు, ఫోన్‌ కాల్స్‌ వచ్చిన నేపథ్యంలో మంత్రి అధికారులతో సమీక్షించారు. ఫిర్యాదు స్వీకరించిన తర్వాత పరిష్కారం అయ్యే వరకు సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు, సబ్‌రిజిస్ట్రార్లు ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ఏదైనా భూమిని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడానికి కారణమేంటో అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని పొంగులేటి సూచించారు. రికార్డులను పరిశీలించడంతో పాటు భూమి వాస్తవ పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అర్హత ఉన్న భూముల విషయంలో న్యాయబద్ధమైన పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.
ప్రజలు తమ భూముల సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని మంత్రి అన్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, 22ఏ భూముల అంశాన్ని ప్రత్యేక కార్యాచరణగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
శాఖల మధ్య సమన్వయంతో పరిష్కారం
రెవెన్యూ శాఖతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. అధికారుల సొంత నిర్ణయాలు, నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం చేయడంతో పాటు భూముల విషయంలో ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించేలా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
22ఏ నిషేధిత భూముల అంశంపై ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా భూ హక్కుదారులకు భరోసా కల్పించడంతో పాటు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలను కూడా క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Latest