• కార్యకర్తల ఆత్మగౌరవమే ప్రాధాన్యం.
• పొత్తుల అంశం నేను చూసుకుంటా.
• ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ కూడా క్షేత్రస్థాయిలో సమర సన్నాహాలు ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన అమరావతిలో గురువారం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో స్థానిక ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. శాసనసభ ఎన్నికల సమయంలో పాటించిన పొత్తు ధర్మాన్ని కొనసాగిస్తూనే, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇచ్చేలా స్థానిక ఎన్నికల్లో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిసింది.
రాష్ట్రంలోని జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులు, పార్టీకి ఉన్న బలం, ప్రజల్లో కార్యకర్తల ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల వ్యూహాన్ని రూపొందించాలని నేతలకు సూచించారు. జనసేనకు బలమైన పట్టు ఉన్న ఇతర ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
ప్రత్యక్ష ఎన్నికలకు మద్దతు
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం మంచిదేనన్న అభిప్రాయాన్ని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను అంచనా వేసి ముందస్తు ప్రణాళిక రూపొందించాలని పవన్ కల్యాణ్ సూచించారు. గ్రామ, వార్డు స్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుకోవడంతో పాటు స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని స్పష్టం చేశారు.
కొత్త రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులపైనా సమావేశంలో చర్చ జరిగింది. కార్యకర్తలు, ప్రజలు చెబుతున్న సమస్యలను ఎమ్మెల్యేలు స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చొరవ చూపాలని పవన్ సూచించారు. ప్రజలతో పార్టీ శ్రేణుల అనుసంధానం మరింత బలోపేతం కావాలని అన్నారు.
పొత్తుల బాధ్యత నాదే
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పొత్తులకు సంబంధించిన అంశాలను తాను చూసుకుంటానని, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ విషయంలో ఎలాంటి అనవసర వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ నిర్దేశించిన విధానానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని ఆదేశించారు.
శాసనసభ ఎన్నికల్లో కూటమి విజయానికి జనసేన కార్యకర్తలు కీలకంగా పనిచేశారని, వారి మనోభావాలను స్థానిక ఎన్నికల్లోనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. పొత్తు ధర్మాన్ని కొనసాగిస్తూనే జనసేనకు బలం ఉన్న ప్రాంతాల్లో పార్టీ శ్రేణులకు తగిన ప్రాధాన్యం కల్పించేలా వ్యూహం రూపొందించనున్నట్లు సమాచారం.
మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంటున్న వేళ జనసేన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార కూటమిలో భాగస్వామిగా ఉంటూనే క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా జనసేన నాయకత్వం ముందుకు సాగుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.








