- సీనియర్ నేత వైపే అందరి మొగ్గు
- కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఏకగ్రీవ తీర్మానం
- హైకమాండ్ కు పంపాలని నిర్ణయం
- రాష్ట్ర ఇన్ ఛార్జి దీపాదాస్, టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు కీలక భేటీకి హాజరు
- రెండు, మూడురోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
- జీవన్ రెడ్డి గెలుపుకోసం నాలుగు జిల్లాల్లో కమిటీలు
- ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్
హైదరాబాద్, మహా
కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిపై నిర్ణయానికొచ్చింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డినే నిలపాలని నిర్ణయానికొచ్చింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ, సిడబ్ల్యుసి సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ల సమక్షంలో జరిగిన నాలుగు జిల్లాల నేతల సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఈమేరకు ఏకగ్రీవ తీర్మానం హైకమాండ్ కు పంపాలని నిర్ణయించారు. నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న 43 నియోజకవర్గాల నుండి కూడా తీర్మానాలు చేసి.. పంపాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఈ స్థానం కోసం వెలిచాల రాజేందర్, విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీపడగా, పార్టీ మాత్రం ఆదినుండీ పార్టీకి విధేయతగా ఉంటున్న అత్యంత సీనియర్ నేత సిట్టింగ్ సీటును మరోసారి ఆయనకే ఇచ్చి గెలిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు ఈ భేటీకి హాజరయ్యారు.
సీనియర్ నేతవైపే అందరి మొగ్గు
ఉత్తర తెలంగాణలో హస్తం పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుపై కన్నేసింది. ఉమ్మడి కరీంనగర్,ఆదిలాబాద్,నిజామాబాద్,మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీ కీలకం గా భావిస్తుంది. అందులో భాగంగానే ఆ నాలుగు జిల్లాల ప్రజా ప్రతినిధులతో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గెలుపు అవకాశాల మీద గాంధీ భవన్ లో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో నలుగురు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి,సీతక్క,కొండా సురేఖ లు.. ఆయా జిల్లాల ఎమ్మేల్యేలు,ఎమ్మెల్సీలు,డిసిసి అధ్యక్షులకు పట్టభద్రుల ఎన్నిక కోసం కష్టపడి పని చేయాలని పార్టీ చీఫ్ సూచించారు.మరో సారి జీవన్ రెడ్డి నీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలుపాలని నాలుగు జిల్లాల ముఖ్య నేతల సమావేశంలో ఏక గ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని అధిష్టానం కు పంపాలని నిర్ణయించారు. సీనియర్ నేత జీవన్ రెడ్డినే మరోసారి ఎంపికచేయడం అత్యంత వ్యూహాత్మకమని భావిస్తున్నారు.
…..








