రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈఏజీఎల్‌ఈ- ఈగల్) కార్యరంగంలోకి వచ్చేసింది. మొత్తం 459 మంది సిబ్బంది పనిచేసే ఈగల్‌లో భాగంగా అమరావతిలో రాష్ట్రస్థాయి నార్కోటిక్స్ పోలీసుస్టేషన్, జిల్లాకొకటి చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఎస్పీగా, తర్వాత సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ హోదాల్లో పనిచేసిన ఐజీ ఆకే రవికృష్ణ ఈగల్ విభాగాధిపతిగా వ్యవహరించనున్నారు. అమరావతిలో రెండు, గంజాయి సమస్య తీవ్రంగా ఉన్న ఏవోబీలోని విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా మరో రెండు కలిపి మొత్తం నాలుగు రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉంటాయి.
గంజాయి, మాదకద్రవ్యాల సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగం సహా సమూల నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ పని చేయనుంది. ఈగల్‌ను మొత్తం ఆరు విభాగాల సమాహారంగా సిద్ధం చేశారు. ఏయే విభాగాలు ఏయే బాధ్యతలు నిర్వర్తించాలో స్పష్టం చేశారు. లీగల్ విభాగం ,డాక్యుమెంటేషన్, శిక్షణ విభాగం, సాంకేతిక విభాగం , రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ పరిపాలన, లాజిస్టిక్స్ విభాగం ,సెంట్రల్ డిపాజిటరీ.








