Mahaa Daily Exclusive

  ధరణి కంటే దరిద్రంగా ‘భూభారతి..! సిద్దిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఫైర్..

Share

  • ధరణి కంటే దరిద్రంగా ‘భూభారతి
  • 22 ఏతో 50 లక్షల మందిని వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
  • సిద్దిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఫైర్
  • నాడు ‘కేసీఆర్ అండ్ ఫ్యామిలీ’.. నేడు ‘రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్’
  • పాలకులు మారినా ప్రజల సమస్యలు తీరలేదని వ్యాఖ్య
  • 22ఏ గందరగోళంపై వెంటనే శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్.

సిద్ధిపేట, మహా : రాష్ట్రంలో రైతుల భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. 22ఏ నిషేధిత జాబితా వల్ల ప్రజలు పడుతున్న గోసను నిరసిస్తూ సిద్దిపేటలో ఎంపీ రఘునందన్ రావుతో కలిసి సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు రైతు భరోసా రూ. 12 వేలు కాదు రూ. 15 వేలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని గాలికొదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక ఆత్మహత్యలు కౌలు రైతులవేనని తెలిపారు. మరోవైపు సాధారణ రైతులు తమ భూమిని కాపాడుకోలేక, నాది అని చెప్పుకోలేక, అమ్ముకోలేక, బ్యాంకుల్లో పెట్టి రుణం కూడా తీసుకోలేక తీవ్రమైన వేదనకు గురవుతున్నారన్నారు.

గత ప్రభుత్వం ‘ధరణి’ పేరుతో రైతులను కష్టాల పాలు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన ‘భూభారతి’ పాతదానికంటే దరిద్రంగా మారిందని రాంచందర్ రావు విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న అర్థం లేని, అనాలోచిత విధానాల వల్ల మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సిద్దిపేట లాంటి నగరాల్లో లక్షలాది ఎకరాలు, ప్లాట్లు 22ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది దీనివల్ల నరకం చూస్తున్నారని అన్నారు. పిల్లల చదువులు, ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం అవసరానికి భూమి అమ్ముకోలేక కుటుంబాలు తీవ్ర భయాందోళనలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయన్నారు.

తప్పు జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని, మరి అలాంటప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ టైటిల్ మాత్రమే మారింది తప్ప తెలంగాణ ప్రజల సమస్యలు తీరలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి పరిపాలన కంటే రియల్ ఎస్టేట్ మీదే ఎక్కువ అనుభవం, ఆసక్తి ఉందని రామచంద్రరావు ఆరోపించారు. భూముల్లో వివాదాలు సృష్టించి, వాటి ధరలు పడిపోయేలా చేసి, పేదలను భయపెట్టి భూములు లాక్కొని ఎక్కువ ధరలకు అమ్ముకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి వ్యూహమని విమర్శించారు. ప్రభుత్వం చేసిన మానసిక వేధింపులకు ప్రజలకు ఎవరు నష్టపరిహారం ఇస్తారని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే 22ఏ లోకి భూములను ఎందుకు చేర్చారో సమగ్ర వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఈ గందరగోళం వెనుక ఉన్న కుట్రలు ఏమిటి, ఎవరికి లాభం చేకూరుస్తున్నారనే దానిపై పూర్తిస్థాయి న్యాయ విచారణ జరిపించాలన్నారు. రైతులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

Latest