Mahaa Daily Exclusive

  ఉద్యోగుల సమస్యలపై ఎదురుదాడి తగదు..:బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్..

Share

  • ఉద్యోగుల సమస్యలపై ఎదురుదాడి తగదు
  • హామీలు అమలు చేయాలి.. జాక్‌తో చర్చించాలి
  • బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్

హైదరాబాద్‌, మహా : ఉద్యోగుల సమస్యలపై ఎదురుదాడి చేయకుండా ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం మానుకొని ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వెయ్యి రోజుల దిశగా సాగుతున్నా కీలక హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఉద్యోగి పనిచేసినందుకు జీతం పొందడం హక్కని, సకాలంలో జీతాలు చెల్లించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం సమర్థంగా అమలవుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. ఎన్ని ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందుతోంది, ఎంతమంది ఉద్యోగులు లబ్ధి పొందారు, ఉద్యోగుల నుంచి ఎంత మొత్తం వసూలు చేశారో వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు రూ.6 వేల కోట్ల బకాయిలు చెల్లించామని చెబుతున్న నేపథ్యంలో ఏ బకాయిల కింద ఎంత చెల్లించారు, ఎవరికి చెల్లించారు, ఇంకా ఎంత బకాయి ఉందో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.

పీఆర్సీ, డీఏలపై స్పష్టత ఇవ్వాలి

పీఆర్సీ అమలు, పెండింగ్‌ డీఏల విడుదలపై ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు చేస్తున్నారని దేవీప్రసాద్‌ అన్నారు. వాటికి సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో ఉద్యోగులపైనే ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని, రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి ఆరోగ్య పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే చర్చించి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నారని, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రతిపక్షాలు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తే వాటికి కౌంటర్‌గా నిరసనలు చేపట్టాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం దుర్మార్గమని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యోగుల జాక్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరు 10న నిర్వహించే చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు దేవీప్రసాద్‌ ప్రకటించారు.