- ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని మరిచిపోకు
- మంత్రి సురేఖ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా
కేటీఆర్ మాట్లాడితే జైలుకు పోతా అంటున్నావు.. తప్పు చేసిన వారు తప్పక జైలుకు పోవాల్సిందే.. మీ పాలనలో అంతా నాశనమేనంటూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీరియస్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లోని తన ఛాంబర్ లో శుక్రవారం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎందరో విద్యార్థులు మృతి చెందినా, ఏనాడు వారి కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ఇటీవల రైలు ప్రమాదంలో విద్యార్థులు మరణిస్తే, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లు ఒక్క కన్నీటి చుక్కైనా కార్చారా అంటూ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. కవిత జైలు నుండి బయటకు వచ్చిన సమయం నుండి కేటీఆర్ కు టెన్షన్ పట్టుకుందని, కేటీఆర్ మానసిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తాను భావిస్తున్నానన్నారు. చెల్లెలిని చూసి కేటీఆర్ భయపడుతున్నట్లు ప్రచారం సాగుతుందని, అసలు రహస్యం బీఆర్ఎస్ నేతలకే ఎరుక అన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర ఉన్నట్లు, ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఆ కుట్ర బయటకు వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి పెట్టుబడులు రాకుండా చేసేందుకు చూస్తున్నారని, ఇక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారన్న విషయాన్ని మరచిపోకు కేటీఆర్ అంటూ మంత్రి హెచ్చరించారు.